రాయలసీమ చిన్నారుల సాహసం.. అభినందించిన ఉపరాష్ట్రపతి

by Anukaran |   ( Updated:2021-07-27 23:00:53.0  )
Rayalaseema childrens, Vice President Venkaiah Naidu
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీకు చెందిన ఐదుగురు చిన్నారులు అద్భుత సాహసం చేశారు. లడాఖ్‌లోని 5,359 మీటర్ల ఎత్తైన ఖర్‌దుంగ్‌లా పర్వతాన్ని కేవలం ఐదు రోజుల్లో అధిరోహించి రికార్డు సృష్టించారు. ఈ నెల 16 నుంచి 21 తేదీల్లో ఖర్‌దుంగ్‌లా పర్వతాన్ని అధిరోహించారు. ఈ సాహసం చేసిన చిన్నారుల్లో అనంతపురం జిల్లాకు చెందిన కడపల రిత్వికశ్రీ(9), కడపల భవ్యశ్రీ(8), సీల్ల యశశ్విత(8), కర్నూలు జిల్లాకు చెందిన గంధం సూర్య(8), గంధం భువన్‌(8) ఉన్నారు. ఇకపోతే గంధం భువన్ ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడి కుమారుడు కావడం విశేషం.

ఎనిమిదేళ్ల వయసులో తన కుమారుడు ఖర్‌దుంగ్‌లా పర్వతాన్ని అధిరోహించడం తనకు చాలా గర్వంగా ఉందంటూ గంధం చంద్రుడు ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి ఒక ఫోటోను సైతం ట్వీట్ చేశారు. మరోవైపు చిన్నారులను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు. పదేళ్లు కూడా నిండని ఈ ఐదుగురు చిన్నారుల సాహసం ముచ్చటగొలిపింది. వారి శిక్షకులను, సహకారం అందించినవారిని అభినందిస్తున్నట్లు వెంకయ్య తెలిపారు. ఈ చిన్నారుల బృందంలో ఒకరైన రిత్వికశ్రీ ఇప్పటికే కిలిమంజారో పర్వతాన్ని సైతం అధిరోహించడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed