‘ఇది రాముడి దేశం.. మనందరం శ్రీరాముడి వారసులం’

by Shyam |
‘ఇది రాముడి దేశం.. మనందరం శ్రీరాముడి వారసులం’
X

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్: హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా వ్యాఖ్య‌లు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విశ్వ హిందూ ప‌రిష‌త్, భ‌జరంగ్ ద‌ళ్‌లు డిమాండ్ చేశాయి. ఈ మేర‌కు శుక్ర‌వారం కోఠిలోని కార్యాల‌యం నుంచి సుల్తాన్ బ‌జార్ చౌర‌స్తా వ‌ర‌కూ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే విద్యాసాగ‌ర్ రావుల దిష్టి బొమ్మ‌ను ఊరేగించి ద‌హ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా వీహెచ్పీ, భ‌జ‌రంగ్ ద‌ళ్ నాయ‌కులు మాట్లాడుతూ… టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీరామ జ‌న్మ‌భూమిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఖండించక పోవడం సిగ్గుచేటన్నారు. నిజాంను ఆదర్శంగా తీసుకొని రాముడిని అవమానిస్తున్న టీఆర్ఎస్ పార్టీని ప్రజలు పూడ్చి పెట్టే రోజులు దగ్గర పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొఘల్ వారసులకు కూడా శ్రీరాముని గొప్పతనం అర్థమైందని, కానీ ఈ కుహనా సెక్యులరిస్టులకు ఇంకా జ్ఞానోదయం కావడం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ మాటలు రామ మందిర నిర్మాణంలో పాల్గొంటున్న భక్తులను అవమానించేలా ఉన్నాయని, రాముడిని ప్రాంతంతో ముడిపెట్టి మాట్లాడటం భారతీయతను అవమానించడమేన‌ని అన్నారు. రాముడు అందరివాడు, ఈ దేశం రాముడిది, మనందరం శ్రీరాముడి వారసులం అని తెలిపారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేదంటే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో వీహెచ్పీ తెలంగాణ రాష్ట్ర క‌న్వీన‌ర్ బండారి ర‌మేష్, సుభాష్ చంద‌ర్, వీహెచ్పీ, భ‌జ‌రంగ్ ద‌ళ్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed