- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరభాషా వ్యామోహం కరోనా కంటే ప్రమాదం: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
దిశ, తెలంగాణ బ్యూరో : పరభాషా వ్యామోహం కరోనా కంటే ప్రమాదకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఉన్నత విద్య వరకు చదువులన్నీ మాతృభాషలోనే బోధన జరగాలని సూచించారు.
పరాయి పాలకులు తెలుగు భాష, సంస్కృతిపై ప్రతికూల భావాన్ని, ఆత్మన్యూనతను ప్రజల్లో నాటే ప్రయత్నం చేశారన్నారు. కానీ కొందరు నేటికీ వాటిని గుడ్డిగా అనుసరించడం బాధాకరమని వెల్లడించారు. మన సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను విద్యార్థులు అర్థం చేసుకుని భవిష్యత్తులో వాటిని అనుసరించి అర్థవంతమైన జీవితాన్ని అందుకోవాలన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాషాభివృద్ధితోపాటు, దేశవ్యాప్తంగా భాష ప్రాతిపదికన ఏర్పాటైన రెండో విశ్వవిద్యాలయం కావడం గర్వకారణమన్నారు.
ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించేందుకు చొరవ తీసుకున్న నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని వెంకయ్య నాయుడు స్మరించుకున్నారు. సంస్కృతిని కాపాడుకోవాలని, సంస్కృతి నిలబడాలంటే భాషను, ఆచార వ్యవహారాలను, మన కళలను పరిరక్షించుకోవాలని ఆయన అన్నారు. సైన్స్, టెక్నాలజీ పదాలకు సంబంధించిన తెలుగు సమానార్థక నిఘంటువులను మాతృభాషలోనే రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావును అభినందించారు. ఇదిలా ఉండగా తెలుగు విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కవి, విమర్శకుడు డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య, కూచిపూడి నాట్యాచార్యులు కళాకృష్ణకు ఉపరాష్ట్రపతి అవార్డులు ప్రదానం చేశారు.
అనంతరం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ నేపథ్యంలో ఏర్పాటుచేసిన ‘ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్’ ప్రదర్శనను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా స్వాతంత్రోద్యమంలో దేశభక్తులు చేసిన త్యాగాలు నిరుపమానమైనవని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, విశ్వవిద్యాలయ ఉపకులపతి తంగెడ కిషన్ రావు, రిజిస్ట్రార్ భట్టు రమేష్, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.