తిట్టినందుకు చితక్కొట్టి.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో బట్టలూడదీసిన ఎస్సై..!

by Shyam |
తిట్టినందుకు చితక్కొట్టి.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో బట్టలూడదీసిన ఎస్సై..!
X

దిశ, అచ్చంపేట: ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం పూర్తిగా విస్మరించిందని, ప్రజలకు సేవ చేసే పాలకులు వారిపైనే దాడులు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ ఆరోపించారు. సోమవారం అచ్చంపేట పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రత్యక్ష దాడులకు పాల్పడుతూ రౌడీషీటర్‌లా వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసభ్యంగా మాట్లాడిన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి గానీ దాడులు చేయడం సరికాదన్నారు.

ఇటీవల దౌల్తాబాద్ గ్రామానికి చెందిన కాశీం అనే వ్యక్తి ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై పరుష పదజాలంతో వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అటువంటి వ్యాఖ్యలను తాము సైతం తప్పు పడుతున్నామని చెప్పారు. చట్టప్రకారం అలాంటి వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కానీ, ఎమ్మెల్యే మెప్పుకోసం ఓ ప్రైవేటు వాహనంలో దౌల్తాబాద్‌కు వెళ్ళిన ఎస్సై ప్రదీప్‌ కాశీంను అరెస్టు చేశారన్నారు. అనంతరం ఎస్ఐ ఆ వ్యక్తిని విపరీతంగా చితకబాది అర్ధరాత్రి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు వద్దకు తీసుకెళ్లి అక్కడ బట్టలు ఊడదీయించి కొట్టడం దారుణమైన చర్య అని, దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.

పోలీసులు ఆత్మాభిమానం చంపుకోవద్దు..

పోలీసులు ఈ ప్రభుత్వంలో ఆత్మాభిమానం చంపుకుని విధులు నిర్వహిస్తున్నారని, అలాంటి పని ఏ అధికారి కూడా చేయాల్సిన అవసరం లేదని వంశీ కృష్ణ తెలిపారు. ఈ సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు న్యాయవిచారణ జరిపించాలన్నారు. అచ్చంపేట ఎస్సై ప్రదీప్ ఎమ్మెల్యే బినామీగా వ్యవహరిస్తున్నారని, అందుకు సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద ఉందన్నారు. అలాగే గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన సీఐ ఎమ్మెల్యే బినామీగా వ్యవహరించి ఎలా ఆస్తులు కూడగట్టుకున్నారో.. వాటన్నిటినీ సరైన సమయంలో బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించిన ఎస్సై ప్రదీప్‌ను సస్పెండ్ చేస్తూ రౌడీ షీటర్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అచ్చంపేట పోలీస్ స్టేషన్‌ ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.

Advertisement

Next Story