కల్వకుర్తిపై సీబీఐ దర్యాప్తు చేయాలి

by Shyam |
కల్వకుర్తిపై సీబీఐ దర్యాప్తు చేయాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుకు ఉపరితల పంప్ హౌజ్ నిర్మించాలని 2016లోనే ప్రత్యేక కమిటీ ఒక నివేదిక ఇచ్చిందని, దాన్ని బుట్టదాఖలా చేసి అశాస్త్రీయ విధానంతో పనులు చేసినందునే ఇప్పుడు కల్వకుర్తిలోని మొదటి పంప్ హౌజ్ నీట మునిగిందని ఆయన పేర్కొన్నారు. గాంధీ భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కల్వకుర్తి పంప్ హౌజ్ ప్రమాదం సంఘటనలో ప్రభుత్వం తప్పేమీ లేదంటూ చీఫ్ ఇంజనీర్ తప్పుడు నివేదికను సమర్పించారని ఆరోపించారు. డిపార్టుమెంటల్ కమిటీ రీడిజైన్ చేయాలని గతంలో చెప్పిందంటూ ఆ అధికారి తాజా నివేదికలో పేర్కొన్నారని, ఇది వాస్తవాన్ని తప్పుదారి పట్టించడమేనని పేర్కొన్నారు.

సమైక్య రాష్ట్రంలో అప్పటి ఏపీ జెన్‌కో సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి ఉపరితల పంప్ హౌజ్ ఉండాలని, భూగర్భ పంప్ హౌజ్‌తో సాంకేతిక సమస్యలు వస్తాయంటూ వివరంగా నివేదిక సమర్పించారని గుర్తుచేశారు. పంప్ హౌజ్ రీడిజైన్ చేయాలన్న అంశం కొత్తదేమీ కాదని, గతంలోనూ ఈ అంశం వివాదాస్పదమైందని గుర్తుచేశారు. అందుకే పంప్ హౌజ్‌ను రీడిజైన్ చేసినట్లయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు బీటలు తప్పవని ఆనాడే కాంగ్రెస్ పార్టీ హెచ్చరించిందని పేర్కొన్నారు. ఆ రోజు హెచ్చరించినట్లుగానే ఇప్పుడు ప్రమాదం జరిగిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed