రేపటి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ పంపిణీ

by Shyam |
రేపటి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ పంపిణీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ పూర్తికావడంతో రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో సోమవారం నుంచి మొదలుకానుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో యాభై మంది హెల్త్ కేర్ సిబ్బంది ఉన్నట్లయితే అక్కడే వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటుకానుంది. అయితే వ్యాక్సిన్ పంపిణీ మాత్రం ప్రభుత్వ వైద్యారోగ్య సిబ్బంది ఆధ్వర్యంలోనే జరగనుంది. ప్రైవేటు హెల్త్ కేర్ సిబ్బందికి టీకాలు అందేలాగ ప్రతీ ఆసుపత్రిలో ఒక నోడల్ అధికారిని నియమించుకోవాల్సిందిగా ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయం సర్క్యులర్ జారీ చేసింది. యాభై మంది కంటే తక్కువ హెల్త్ కేర్ సిబ్బంది ఉన్నట్లయితే వారికి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో లేదా ప్రైవేటు ఆసుపత్రిలో టీకాలు ఇస్తామని ఒక ప్రకటనలో తెలిపారు.

‘కొవిన్’ సాఫ్ట్‌వేర్‌లో పేర్లు నమోదు చేసుకున్న ప్రైవేటు హెల్త్ కేర్ సిబ్బందికి మాత్రమే టీకాల పంపిణీ జరుగుతుందని, పేర్లు నమోదు చేసుకోకపోయినట్లయితే సాధ్యం కాదని డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తిగా సాఫ్ట్‌వేర్ ఆధారంగానే టీకాల పంపిణీ జరుగుతుంది తప్ప’ఆఫ్ లైన్’లో నిర్వహించలేమని తేల్చి చెప్పారు. ప్రతీ వ్యాక్సిన్ కేంద్రంలో రోజుకు వంది మంది సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నందన అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే అదే రోజున రెండో విడతగా కూడా టీకాలను ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకూ ఉదయం 10 గంటల మొదలు సాయంత్రం నాలుగు గంటల వరకు వ్యాక్సిన్ పంపిణీ చేశామని, సోమవారం నుంచి మాత్రం మధ్యాహ్నం మూడు గంటలకే క్లోజ్ చేయనున్నట్లు తెలిపారు. వారంలో 4రోజులు మాత్రమే ఉంటుందని, బుధవారం, శనివారం, ఆదివారాల్లో వ్యాక్సిన్ పంపిణీ ఉండదని స్పష్టం చేశారు.

ప్రభుత్వం తరఫున వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్నందున ప్రతీ కేంద్రానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తరఫున ఒక స్పెషల్ ఆఫీసర్‌‌ను నియమించామని, అందరికీ టీకాలను అందించడంలో స్వయంగా అక్కడే ఉండి పర్యవేక్షిస్తారని తెలిపారు. అవసరానికి తగినట్లుగా అదనపు డోసులను, సిబ్బందిని సమకూర్చడంపై నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. ప్రైవేటు హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా స్వయంగా భాగస్వాములు కావచ్చని వివరించారు. ఆయా కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ ‘కొవిన్’ ద్వారా జరుగుతున్నప్పటికీ ప్రతీరోజు సాయంత్రానికి ప్రతీ కేంద్రం నుంచి నిర్దిష్ట పార్మాట్‌లో ఎంత మందికి టీకాలు ఇచ్చిందీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు తెలియజేయాలని డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Advertisement

Next Story