రేపటితో ముగియనున్న ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్

by Shyam |
రేపటితో ముగియనున్న ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా ఫ్రంట్‌లైన్ వారియర్లకు ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. శనివారం నుంచి ఇక వారికి వ్యాక్సిన్ ఇవ్వడం కుదరదు. ప్రత్యేక పరిస్థితులున్న ఫ్రంట్‌లైన్ వారియర్లకు మాత్రమే నిర్దిష్టంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు గత నెల 16వ తేదీన తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ హెల్త్ కేర్ వర్కర్లతో ప్రారంభమైంది. రాష్ట్రంలో సుమారు 1.87 లక్షల మంది ఫ్రంట్ లైన్ వారియర్లు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

ఈ నెల ఆరో తేదీ నుంచి ఇప్పటివరకు 64,455 మందికి (37%) మాత్రమే టీకాల పంపిణీ పూర్తయింది. ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు మిగిలింది. ఇక తొలి డోస్ తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోస్ ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నెల ఆరో తేదీ నుంచి లాంఛనంగా రెండో డోస్ ఇవ్వడం మొదలుకావాల్సి ఉంది. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రజారోగ్య శాఖ ఈ నెల ఆరో తేదీ నుంచే దీన్ని మొదలుపెట్టాలనుకుంటోంది.

ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 2.57 లక్షల మందికి తొలి డోస్ ఇవ్వడానికి నాలుగు వారాలు పట్టినందున మళ్ళీ రెండో డోస్ ఇవ్వడానికి కూడా దాదాపు అంతే సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోగా కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి, యాభై ఏళ్ళ వయసు దాటినవారికి కూడా వ్యాక్సిన్ పంపిణీపై మార్గదర్శకాలను జారీ చేయనుంది. మార్చి నెల రెండో వారం నుంచి వీరికి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కావచ్చని కేంద్ర వైద్యారోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇటీవల పార్లమెంటులో ప్రస్తావించారు. ఈ వారం చివరికల్లా ఈ రెండు కేటగిరీల పౌరులు వ్యాక్సిన్ కోసం పేర్లను నమోదు చేసుకోడానికి ‘కొవిన్-2.0’ వెబ్‌సైట్, మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story