టీకా వేసుకున్నారా.. మాస్కు అక్కర్లే..!

by Anukaran |   ( Updated:2021-03-09 03:35:13.0  )
టీకా వేసుకున్నారా.. మాస్కు అక్కర్లే..!
X

న్యూయార్క్: అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా ఆంక్షలు విధించి ఏడాది పూర్తి కావొస్తున్న తరుణంలో టీకా పంపిణీ శరవేగంగా సాగుతుండగా సానుకూల ప్రటకన చేసింది. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ సాధారణ జీవితం నెలకొంటాయన్న ఆశలకు బలాన్నిస్తూ యూఎస్ సీడీసీ మార్గదర్శకాలను రూపొందించింది. టీకా తీసుకున్న అమెరికా వాసులు దాదాపు సాధారణ జీవితాన్ని గడపవచ్చని తెలిపింది. కరోనా టీకా తీసుకున్నవారు పరస్పరం ఇండోర్‌లలో మాస్కులు ధరించకుండా, భౌతిక దూరాన్ని పాటించకుండా కలుసుకోవచ్చని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) వివరించింది. టీకా వేసుకోని వారితోనూ పరిమిత సంఖ్యలో(ఉదాహరణకు ఒక కుటుంబం) కలువవచ్చని తెలిపింది. కరోనా బారిన పడే ముప్పు ఎక్కువున్న వారితో కలవరాదని సూచించింది. అంతేకాదు, కరోనా టెస్టులను, క్వారంటైన్ నిబంధనల నుంచీ మినహాయింపు పొందడానికి సీడీసీ అవకాశమిచ్చింది. అయితే, టీకా వేసుకున్న తర్వాతా కరోనా లక్షణాలు కనిపిస్తే మాత్రం పై నిబంధన వర్తిస్తుందని వివరించింది. బహిరంగ ప్రాంతాల్లో మాత్రం అందరిలాగే టీకా వేసుకున్నవారూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పేర్కొంది. టీకా చివరి డోసు తీసుకున్న రెండు వారాల తర్వాత లబ్దిదారుడు సుక్షితమని సీడీసీ తెలిపింది.

కరోనా సంక్షోభానంతర సాధారణ ప్రపంచానికి దారులు వేస్తున్నామని ఈ మార్గదర్శకాల విడుదల తర్వాత సీనియర్ అడ్వైజర్ యాండీ సాల్విట్ వివరించారు. టీకా తీసుకున్నవారి సంఖ్య పెరుగుతున్నాకొద్దీ ఆంక్షలు క్రమంగా పలుచనవుతాయని తెలిపారు. ఇప్పటి వరకు మూడు కోట్ల మంది అమెరికన్లు వ్యాక్సిన్ తీసుకున్నారు. మూడో టీకా జాన్సన్ అండ్ జాన్సన్‌కూ అనుమతి లభించడంలో యూఎస్‌లో వ్యాక్సినేషన్ శరవేగంగా జరుగుతున్నది. అమెరికా ప్రభుత్వం ఈ శుభవార్తతోపాటు హెచ్చరికలనూ గుర్తుచేసింది. ఇప్పటికి ఇంకా 90 శాతం మంది టీకా తీసుకోవాల్సి ఉన్నదని, అందుకే టీకా తీసుకున్న తర్వాత జాగ్రత్తలను మరవరాదని తెలిపింది. మే చివరి వరకు అమెరికా పౌరులందరికీ సరిపడా టీకాలను దేశం సమకూర్చుకుంటుందని అధ్యక్షుడు జో బైడెన్ గతవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. దేశంలో లాక్‌డౌన్ ఆంక్షలు విధించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా గురువారం ఆయన అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Advertisement

Next Story