సర్కారుకు విన్నపం.. 17 ఏండ్ల నుంచి ఒకే పద్ధతి

by Anukaran |
సర్కారుకు విన్నపం.. 17 ఏండ్ల నుంచి ఒకే పద్ధతి
X

దిశ, న్యూస్ బ్యూరో: భారీ పథకాలను చేపడుతున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)లో ఖాళీ పోస్టులు భర్తీకి నోచడంలేదు. విశ్వనగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న హెచ్ఎండీఏలో సరిపడా ఉద్యోగులు లేనందున భారీ పథకాలు కార్యరూపంలోకి రావడంలో, ప్రారంభించిన పథకాలలో జాప్యం చోటు చేసుకుంటున్నది. గతంలో పనిచేసిన ముగ్గురు కమిషనర్లు కూడా ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, పనికి సరిపడా కొత్త పోస్టులను మంజూరు చేయాలని సర్కారుకు విన్నపం చేశారు. 2003లో అప్పటి హుడాకు జీవో 496 ద్వారా 600 పోస్టులను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. ప్లానింగ్ విభాగానికి 110, ఇంజినీరింగ్‌కు 110, పరిపాలనా వ్యవహారాలకు 334, అర్బన్ ఫారెస్ట్రీ విభాగానికి 37, ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్‌కు 9 పోస్టులు మంజూరు చేసిన సర్కారు ఇప్పటి వరకు అంటే.. దాదాపు 17 ఏండ్లుగా హెచ్ఎండీఏకు కొత్త పోస్టులు మంజూరు చేయడం లేదు. ఖాళీ అవుతోన్న పోస్టులను భర్తీ చేయడం లేదు. ఫలితంగా డిప్యూటేషన్, ఔట్ సోర్సింగ్ పద్ధతిన వచ్చే వారిపైనే అథారిటీ ఆధారపడాల్సి వస్తుంది. సంస్థకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ప్లానింగ్ విభాగంలో ఒక్కొక్క అధికారి రెండేసి బాధ్యతలను నిర్వహించాల్సి వస్తుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2003లో హుడాగా ఉన్న సంస్థ విస్తీర్ణం 1,348 చ.కి.మీ.లు మాత్రమే. సంస్థ పరిధిలో మొత్తం 103 గ్రామాలు మాత్రమే ఉండేవి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సంస్థ విస్తీర్ణం 7,257 చ.కి.మీ.లు. 1,032 గ్రామాలు ఉన్నాయి. విస్తీర్ణం పెరిగింది. గ్రామాలు పెరిగాయి. పథకాలు అధికంగానే ఉన్నాయి.

అపరిష్కృతంగా దరఖాస్తులు..

సంస్థకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ప్రణాళికా విభాగంలో అథారిటీ ఉద్యోగులు లేక దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం(డీపీఎంఎస్) పద్ధతి కార్యరూపంలోకి వచ్చిన తర్వాత 21 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేయాలనేది లక్ష్యంగా ఉన్నది. కానీ, సరిపడా సిబ్బంది లేరు. పైగా అధికారులపై విపరీతమైన ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అథారిటీలో 110 మందికి గానూ కనీసంగా 55 మంది వరకు పదవీ విరమణ చేశారని అధికారులే వెల్లడిస్తున్నారు. మరో ముగ్గురు బదిలీపై ఇతర మున్సిపాలిటీలకు వెళ్లారు. దీంతో అసలే ఉద్యోగుల కొరత ఆపై బదిలీలు చేయడంతో పనిభారం మరింత పెరిగింది. ఈ ఖాళీలను పూర్తిచేసేందుకు డిప్యూటేషన్ అధికారులపై ఆధారపడాల్సి వస్తున్నది. అయితే, డిప్యూటేషన్ అధికారులకు, అథారిటీ అధికారులకు మధ్య సమన్వయం లోపిస్తున్నది. ఫలితంగా దరఖాస్తుల పరిష్కారంలో కాస్త జాప్యం జరగడం, పరస్పరం విమర్శలు సంధించుకోవడం కనిపిస్తున్నది. ప్రస్తుతం జేపీవో, ఏపీవో, పీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

దరఖాస్తుదారుల అసహనం..

ఇదిలా ఉండగా సంస్థకు ముఖ్యమైన విభాగం ఐటీ సెల్. ఈ ఐటీ సెల్ సమర్థవంతంగా పనిచేయకపోవడం వల్ల ప్లానింగ్ విభాగానికి వచ్చే దరఖాస్తులు అస్తవ్యస్తంగా వెళ్తున్నాయి. డీసీ లేఖలు రావడంలేదు. కొత్త దరఖాస్తులు అప్‌లోడ్ చేస్తే ఓటీపీలు రావడంలేదని దరఖాస్తుదారులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మంజూరైన దరఖాస్తులకు ప్రొసీడింగ్స్, ప్లాన్‌లు రావడం లేదని కార్యాలయం చుట్టూ తిరిగిపోతున్నారు. ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన అందుబాటులో ఉండటంలేదు. ఎవరికి తమ గోడు వెళ్లబోసుకోవాలో తెలియని పరిస్థతి. ఉన్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది మాత్రం తమకు పరిచయమున్న నిర్మాణాదారులకు, డెవలపర్స్‌కు మాత్రమే పనిచేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. చాలా కాలంగా ఐటీ సెల్‌లో పనిచేస్తున్నవారిని కొనసాగిస్తుండటం వల్ల వారు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనికి సీఐవో ఉన్నప్పటికీ ఆయన కార్యాలయానికి ఎప్పడొస్తారో… రారో..? తెలియని పరిస్థతి నెలకొన్నది.

రిటైర్డైన వారే తిరిగి నియామకం..

హైదరాబాద్ మహానగరం శివారులో భారీ పథకాలు చేపట్టే అథారిటీలో 2003లో మంజూరైన పోస్టులు 110 మాత్రమే. అందులో దాదాపు సగం మంది పదవీ విరమణ పొందారు. అప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పడు చేపడుతోన్న పథకాలు భారీగా ఉండటంతో సరిపడా ఉద్యోగుల అవసరం సంస్థకు ఏర్పడుతుంది. అయితే, పదవీ విరమణ చేసిన కొందరినీ తిరిగి కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకుని పనిభారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది అథారిటీ. భారీ పథకాలైన ల్యాండ్ పూలింగ్ వందల ఎకరాల్లో లేఅవుట్ అభివృద్ది, నైట్ సఫారీ, గండిపేట్ సుందరీకరణ, జేబీఎస్- హకీంపేట్, ప్యారడైజ్ – కొంపల్లిలకు రెండు స్కైవేలు, జన్‌వాడ వద్ద ఔటర్ రింగ్ రోడ్ ఇంటర్ చేంజ్, ఔటర్ రింగ్ రోడ్‌లో మొత్తం సోలార్ లైటింగ్, ఓఆర్ఆర్ ఇంటర్ చేంజెస్‌ల్లో వే సైడ్ ఎమినిటీస్, ఔటర్ చుట్టూర 13 మినీ నగరాల అభివృద్ది, శివారులో 6 ట్రక్ పార్కులు, 3 ఇంటర్ సిటీ బస్ టెర్మినల్స్, చర్లపల్లి, ఈదులనాగులపల్లిలో మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టు, సరూర్‌నగర్‌లో మల్టీ మోడల్ పార్కింగ్ భవనం వంటి పథకాలు ప్రతిపాదనల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం హుస్సేన్‌సాగర్ వద్ద ఐ అండ్ డీ, లేక్ వ్యూ ఫ్రంట్ పార్కు, ఫారెస్టు బ్లాక్‌ల్లో సివిల్ పనులు పూర్తికావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొత్త పోస్టులు మంజూరు చేయకున్నా.. ఖాళీ పోస్టులను మంజూరు చేయాలని అధికారులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed