రాయలసీమ పనులు మొదలైతే కేసీఆర్ రిజైన్ చేయాలి

by  |
రాయలసీమ పనులు మొదలైతే కేసీఆర్ రిజైన్ చేయాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణను ఏడారిగా మార్చే ప్రాజెక్టులకు ఏపీ నిర్మాణం చేపడుతుంటే సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫైరయ్యారు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే అసలు కేసీఆర్ ఏం చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు రెండు టీఎంసీల నీళ్ల కోసం లక్ష కోట్లను ఖర్చు చేసి.. ఏపీ ప్రాజెక్టులపై ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. శనివారం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యం పెంచి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని నిర్మిస్తే 6 టీఎంసీల నీళ్లను తెలంగాణ నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంగమేశ్వర్ దగ్గర రోజుకు 3టీఎంసీల నీళ్లను ఏపీ తీసుకుపోతుంటే కేసీఆర్ మౌనం వహించడంపై అనుమానాలు కలిగిస్తుందన్నారు. జగన్‌కు ఎన్నికల సమయంలో కేసీఆర్ సాయం చేసారనే ప్రచారం జరుగుతుందని, ఇది నిజమే అనే విధంగా ఉందన్నారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్ పూర్తి అయితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని, ఈ పనులు మొదలైతే సీఎం కేసీఆర్ పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.

పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కుల నీళ్లను తీసుకుపోతామని ఏపీ అధికారికంగా ప్రకటన చేసిందని, పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 6 టీఎంసీల నీళ్లు తీసుకుపోయేందుకు జీవో విడుదల చేసినా కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతలు పూర్తి అయితే నాగార్జున సాగర్, పాలమూరు ఎత్తిపోతలు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు చుక్క నీరు ఉండదన్నారు. తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఏపీ బహిరంగంగా తీసుకుపోతామని ప్రకటిస్తే కూడా సీఎం కేసీఆర్ అడ్డుకోవడం లేదని మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతలకు ఇప్పటికే టెండర్లు పిలిచారని, పోతిరెడ్డిపాడుకి ఈ నెల 11న టెండర్లు పిలుస్తున్నట్లు తెలుస్తుందని, టెండర్లు పూర్తి కావాలనే సీఎం కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా వేయమన్నారని ఆరోపించారు.


Next Story

Most Viewed