ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు

by  |
ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: చీటా కాలింగ్ ఫ్రం విక్టర్ ఆఫీసర్… చీటా రెస్పాండింగ్ సర్. అంటూ పోలీస్ స్టేషన్లలోనో రైల్వే డిపార్ట్ మెంట్ ఉద్యోగులో మాట్లాడుకోవడం చూశాం. కానీ ఓ చిన్న గ్రామంలో ఈ విధానం అమలవుతోంది. వాటిని ఎవరు వాడుతున్నారు? ఎందుకోసమో తెలిస్తే ఆశ్యర్యపోక మానరు. వీటివల్ల గ్రామం ఎంతటి ప్రతిఫలాన్ని పొందుతుందో తెలియాలంటే మనమూ ఈ మోడల్ గ్రామం గురించి తెలుసుకోవల్సింది. వినూత్న ప్రయోగాలకు వేదికగా నిలిచిన తాండ్రియాల గ్రామంపై ‘దిశ’ స్పెషల్ స్టోరీ…

వాకీటాకీలతో పంచాయితీలో పారిశుద్ధ్య పనులుపై ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నారు. వాకీటాకీలను వినియోగిస్తున్న ఈ గ్రామం రాష్ట్రంలోనే మొదటిది కావచ్చు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో అమలవుతోంది. పంచాయితీ సిబ్బందికి మొబైల్ ఫోన్లు ఇవ్వడం కన్నా వాకీటాకీలు అప్పగిస్తే బెటర్ అనుకున్నారా గ్రామ సర్పంచ్ గడీల గంగా ప్రసాద్. 20 ఏళ్లు దోహా ఖతర్ మునిసిపాలిటీలో సూపర్ వైజర్ గా పనిచేసిన ఆయన ఇటీవలే స్వగ్రామానికి చేరుకున్నారు. గత పంచాయితీ ఎన్నికల్లో సర్పంచ్ గా ఎన్నికైన ఆయన వినూత్న పద్దతులతో పంచాయితీని ఆధునీకరిస్తున్నారు. 9 మంది సిబ్బందితో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు, సర్పంచ్ కూడా వాకీటాకీలు పట్టుకుని గ్రామంలో పనులు చేస్తున్నారు. ఒక్కో వాకీటాకీకి రూ.1240 వెచ్చించి కొనుగోలు చేశారు. వీటి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరించడమే కాకుండా సిబ్బంది పంచాయితీ కార్యాలయానికి వచ్చే వరకూ వేచి చూడాల్సిన పరిస్థితి లేకుండా పోయింది. మొబైల్ ఫోన్లయితే తరుచూ రీఛార్జి చేయించడం వంటి ఆర్థిక భారం కూడా లేకుండా పోయింది. పంచాయితీ కార్యాలయంలోనే వాకీటాకీల బ్యాటరీలను ఛార్జింగ్ చేసి ఉదయం డ్యూటీకి వెల్లేప్పుడు సిబ్బందికి అప్పగిస్తున్నారు. నెల రోజుల క్రితమే పంచాయితీలో బయోమెట్రిక్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఉదయం 6 గంటల నుండి 6 గంటల 10 నిమిషాల లోపున బయోమెట్రిక్ మిషన్ లో వేలిముద్ర వేస్తేనే ఆరోజు వారికి అటెండెన్స్ పడేలా ఏర్పాటు చేశారు.

చెత్త డబ్బాల ఏర్పాటు…

సుమారు 4,500 జనాభా ఉన్న తాండ్రియాలలో చెత్త సేకరణ కోసం పాత పద్దతికి స్వస్తి పలికారు సర్పంచ్ గంగా ప్రసాద్. 200 లీటర్ల రెండు డ్రమ్ములను కొనుగోలు చేసిన ఆయన వీధుల్లో ప్రత్యేక స్టాండ్ లను ఏర్పాటు చేసి వాటిని ఏర్పాటు చేయించారు. తడి, పొడి చెత్తలకు వేర్వేరుగా డబ్బాలు వేసి అందులో గ్రామస్థులు వేసే విధంగా అవగాహన కల్పించారు. గతంలో సిమెంటుతో తయారు చేసిన కుండీలను ఏర్పాటు చేయడం వల్ల వాహనాలు ఢీ కొడితే అవి పగిలిపోవడంతో తరుచూ కొత్తవి ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉండేది. నూతన విధానంతో అలాంటి సమస్యే ఉత్పన్నం కాకుండా పోయింది. అలాగే చెత్త డబ్బాలను భూమికి కొంత ఎత్తులో అమర్చడంతో అక్కడ పందులు. కుక్కలు వచ్చి చేరే అవకాశమే లేకుండా పోయింది. వినూత్నంగా ఆలోచించిన సర్పంచ్ గ్రామ ప్రజలకు కొత్తతరహా పరిపాలన అందిస్తూ అధికారుల నుండి మెప్పు కూడా పొందుతున్నారు.

అక్కడి అనుభవాలే… : గడీల గంగా ప్రసాద్, గ్రామ సర్పంచ్

దోహా ఖతర్ మునిసిపాలిటీలో సూపర్ వైజర్ గా పనిచేసినప్పటి అనుభవంతో గ్రామంలో కొత్తతరహాలో సేవలందించే విధానానికి శ్రీకారం చుట్టా. పంచాయితీ పరిశుభ్రంగా ఉండడంతో పాటు, సిబ్బందికి ఎప్పటికప్పుడు పనులు పురమాయించే అవకాశం కల్గింది. తక్కువ ఖర్చుతోనే వాకీటాకీలను కొనుగోలు చేశా. ప్రస్తుతానికైతే వీటిని స్వంత డబ్బులతోనే కొనుగోలు చేయించి సిబ్బందికి అందజేశాను. ప్రధానంగా సిబ్బందికి పనులు అప్పగించేప్పుడు సర్పంచ్ గా నేను, పంచాయితీ ఉద్యోగులు వేర్వేరుగా చెప్తుండడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో నేను దోహా ఖతర్ లో వాకీటాకీలు వాడే విధానాన్ని ఇక్కడ అమలు చేశా. వీటిని సిబ్బందికి ఇచ్చిన తరువాత ఎవరు ఏ పనికి వెల్తున్నారో కూడా అందిరీకీ తెలిసిపోతున్నది. పనిలో లేకుండా ఉన్న వారెవరో తెలిసిపోతుండడంతో ఒకే వ్యక్తికి పలు పనులు చెప్పే పరిస్థితి లేకుండా పోయింది.



Next Story