బెలూన్‌లో ఆకాశం అంచులకు..

by  |
బెలూన్‌లో ఆకాశం అంచులకు..
X

అంతరిక్షంలోకి వెళ్లాలంటే రాకెట్ ఎక్కాలి. కానీ అంత డబ్బూ లేదు.. అన్ని ట్రైనింగులూ మన వల్ల కాదు. కానీ ఆకాశం అంచులను చూడాలన్న కోరిక మాత్రం ఉంది. అలాంటి వారి కోసమే ఫ్లోరిడాలోని ఒక స్టార్టప్ వినూత్న విధానాన్ని రూపొందించింది. బెలూన్‌లో ఆకాశం అంచుల దాకా వెళ్లి చూసి తిరిగొచ్చే అవకాశాన్ని కల్పించనుంది. ఒక హాట్ ఎయిర్ హైడ్రోజన్ బెలూన్‌కు ఫుట్‌బాల్ స్టేడియమంత సైజున్న క్యాప్సుల్ జోడించి పైకి పంపిస్తారు. భూగ్రహ వాతావరణానికి దూరంగా ఈ బెలూన్ మనుషులను తీసుకెళ్లనుంది.

ఫ్లోరిడాకు చెందిన స్పేస్ పర్‌స్పెక్టివ్ స్టార్టప్ కంపెనీ ఇందుకోసం అలాస్కాలోని కొడియాక్‌లో గల పసిఫిక్ స్పేస్‌పోర్ట్ కాంప్లెక్స్‌ను వేదికగా చేసుకోనుంది. మనుషులను మోసుకెళ్లే ఈ క్యాప్సుల్‌కు ‘స్పేస్‌షిప్ నెప్ట్యూన్’ అని పేరు పెట్టారు. ఎనిమిది మంది పట్టే ఈ క్యాప్సుల్‌ను నడపడానికి ప్రత్యేకంగా ఫ్లైట్ క్రూ కూడా ఉండబోతోంది. అయితే ఇందులో ఆరు గంటల జర్నీకి ఒక్కో ప్రయాణీకుడు 125000 డాలర్లు చెల్లించుకోక తప్పదు. ఇది అలాస్కా టూరిజం ఎదగడానికి చాలా బాగా ఉపయోగపడనుందని అలాస్కా ఏరోస్పేర్ కార్పోరేషన్ సీఈవో మార్క్ లెస్టర్ తెలిపారు. వచ్చే ఏడాది ఈ జర్నీకి సంబంధించి టెస్ట్ ఫ్లైట్‌ని నాసాలోని కెన్నడీ స్పేస్ సెంటర్‌లో షటిల్ ల్యాండింగ్ ఫెసిలిటీ ద్వారా మొదటి టెస్ట్ ఫ్లైట్ పంపించనున్నట్లు తెలుస్తోంది.


Next Story