పేరు రైతులది.. ఊరు దళారులది..!

by  |
పేరు రైతులది.. ఊరు దళారులది..!
X

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కొంత మంది ఫెర్టిలైజర్ వ్యాపారుల దోపిడీకి అడ్డేలేకుండా పోతున్నది. కరోనా నేపథ్యంలో యూరియా పేరుతో కొత్తరకం దందాకు తెరలేపుతున్నారు. రైతుల ఆధార్ కార్డులతో దళారులు వందల క్వింటాళ్ల యూరియాను కొల్లగొడుతున్నారు. ఫలితంగా అవసరం ఉన్న సామాన్య రైతుకు యూరియా దక్కకుండా పోతున్నది. వీరు అక్రమంగా నిల్వ చేసి ఒక్కో యూరియా బస్తాకు 350కి పైగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.

దిశ ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యూరియా అమ్మకాలపై అధికార యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కులకు వరంగా మారింది. కరోనా నేపథ్యంలో పట్టణాలకు వచ్చి యూరియా కొనుగోలు చేసేందుకు రైతులు జంకుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కొంత మంది ఫర్టిలైజర్ వ్యాపారులు రైతుల ఆధార్‌ కార్డులతో వందల క్వింటాళ్ల యూరియాను తీసుకెళ్తున్నారు. సొసైటీల నుంచి బస్తాను 265కు సేకరించి రైతులకు 360కి పైగా విక్రయిస్తున్నారు. యూరియాకు కృత్రిమ కొరత సృష్టిస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు. దళారుల కారణంగా జిల్లాలో ఒక్కసారిగా యూరియా కొరత ఏర్పడింది. దీనిపై రైతులు ఆందోళనకు దిగారు. దీంతో ఎరువుల కొరతకు కారణం ఏమిటని తేల్చే విషయంలో అధికార యంత్రాంగం దృష్టి సారించింది. యూరియా అమ్మకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే కోణంలో విచారణ ప్రారంభించారు.

సాగర్ ఆయకట్టులో డిమాండ్..

నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో మొదటి జోన్​లో మూడు లక్షల ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేస్తున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో యూరియా అవసరం ఎక్కువగా ఉండగా యాదాద్రి జిల్లాలో యూరియా డిమాండ్ తక్కువగా ఉంది. అధికారులు మూడు జిల్లాలకు సమానంగా కేటాయిస్తుండగా ఆయకట్టు ప్రాంత రైతులకు యూరియా కొరత ఏర్పడుతున్నది. ఏ ప్రాంతానికి చెందిన ఎరువుల కంపెనీల వారైనా మిర్యాలగూడకు రైల్వే వ్యాగన్లతో తీసుకువస్తున్నారు. వచ్చిన దాంట్లో 50శాతం సొసైటీలకు మిగతాది తమకు అనుకూలంగా ఉన్న కొన్ని దుకాణాలకు పంపుతున్నారు. ఆయా వ్యాపారులు రూ. 266 ఇవ్వాల్సిన యూరియా బస్తా.. రూ.360 ధరకు రైతులకు విక్రయిస్తున్నారు.

ఆధార్ నెంబర్‌తో అక్రమాలు..

కరోనా నేపథ్యంలో గ్రామాల నుంచి రైతులు ఎరువుల కోసం వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌లో కొన్ని మార్పులు చేసింది. రైతుల ఆధార్‌కార్డు నమోదు చేయడంతో పాటు, ఎరువులను తీసుకెళ్లే వారి వేలిముద్ర తీసుకుంటే సరిపోతుందని సూచించింది. ఒక్కో గ్రామానికి చెందిన అయిదారుగురు రైతులు తమ ఆధార్‌కార్డులు ఇచ్చి, ఆటో, లేదా ఇతర వాహన డ్రైవర్లను యూరియాకు పంపిస్తున్నారు. ఎరువుల కొనుగోళ్లపై పరిమితి లేకపోవడంతో ఆధార్‌కార్డుల నెంబర్లు నమోదు చేసి ఎన్ని సంచులు అంటే అన్ని ఇచ్చేస్తున్నారు. ఒక్కొక్కరు 30 నుంచి 40 మెట్రిక్‌ టన్నుల యూరియాను తీసుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు.

ఇతర ఎరువులు కొంటేనే యూరియా..

జిల్లాలోని కొంత మంది వ్యాపారస్తులు తమ వద్దనున్న ఇతర కాంప్లెక్స్ ఎరువులు, జింక్ వంటివి కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తామంటూ ఆంక్షలు పెడుతున్నారు. మిర్యాలగూడ ఏరియాలో బోర్లు, బావుల కింద ముందుగా వేసిన పంటకు యూరియాకు అవసరం రావడంతో వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దళారుల తీరుతో సాగర్ ఆయకట్టు కింద సాగు చేసిన వరి పంటలకు యూరియా అవసరమైనప్పుడు రైతులు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు గోదాములను, రీటైల్ షాపులను తనిఖీలు చేసి ప్రభుత్వం ధరలకే యూరియా విక్రయించే విధంగా చూడాలని, యూరియాను బ్లాక్ చేసే వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


Next Story

Most Viewed