వచ్చే ఏడాది నుంచి అంగన్వాడీలలో ఉర్దూ మీడియం బోధన

by Shyam |
Satyavathi Rathod
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఏడాది నుంచి అంగన్వాడీ కేంద్రాలలో ఉర్దూ మీడియంలో బోధన చేయనున్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ప్రస్తుతం ఉర్దూ మీడియం బోధించే అంగన్వాడీ టీచర్లు 412 మంది ఉన్నారని చెప్పారు. ముస్లీం ప్రాంతాల్లో ఉర్దూలో, గిరిజన ప్రాంతాల్లో లంబాడా, కోయ వంటి స్థానిక భాషల్లో బోధన చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి..? వాటి పెంపు ప్రతిపాదన..? వాటిలో బోధనా మాధ్యమంగా ఉర్దూ భాష అమలు చేసే విషయం పరిశీలనలో ఉందా? మినీ అంగన్వాడీలకు అంగన్వాడీ టీచర్లకు సమానంగా వేతనాల పెంపుపై సభ్యులు కాటేపల్లి జనార్ధన్ రెడ్డి , కూర రఘోత్తం రెడ్డి, శ్రీమతి కల్వకుంట్ల కవిత అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు.

రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, అయితే జనాభా పెరిగిందని, పెరిగిన జనాభాకు అనుగుణంగా 870 అంగన్వాడీ కేంద్రాల పెంపు కోసం ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అంగన్వాడీ సిబ్బంది నియామకానికి విద్యార్హతలలో ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో అక్కడి స్థానికులతో భర్తీ కోసం అనేక వెసులుబాటులు కల్పించామని చెప్పారు. హైదరాబాద్ లో ఎక్కువ కేంద్రాలకు ప్రతి పాదనాలు పంపామని చెప్పారు.

అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు ప్రీ-ప్రైమరీ స్కూల్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే పుస్తకాలు కూడా అందించామన్నారు. ఆయా ప్రాంతాల్లోని స్థానిక భాషలోనే బోధన చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed