రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు!

by Harish |   ( Updated:2021-11-01 08:51:40.0  )
రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) లావాదేవీలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. పండుగ సీజన్ కారణంగా ఈ ఏడాది అక్టోబర్‌లో ఏకంగా 420 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) వెల్లడించింది. ఇది యూపీఐ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ ప్రారంభం నుంచి ఆల్‌టైం హై అని, విలువ పరంగా రికార్డు స్థాయిలో రూ.7.71 లక్షల కోట్లని ఎన్‌పీసీఐ తెలిపింది.

సెప్టెంబర్ నెలలో మొత్తం 365 కోట్ల లావాదేవీలు, విలువ పరంగా రూ. 650 కోట్లు నమోదయ్యాయి. నెలవారీ ప్రాతిపదికంగా ఇది సంఖ్యా పరంగా 15 శాతం, విలువ పరంగా 18.5 శాతం వృద్ధి. అలాగే గతేడాదితో పోలిస్తే సంఖ్యా పరంగా రెట్టింపు కాగా, విలువ పరంగా 100 శాతం పెరుగుదల అని గణాంకాలు చెబుతున్నాయి. 2016 నుంచి యూపీఐ లావాదేవీలు భారీగా పెరుగుతున్నాయి. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా ఇది అత్యంత వేగంగా పుంజుకుంది.

కరోనాకు ముందు 2019 అక్టోబర్‌లో మొదటిసారిగా 100 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2020 అక్టోబర్‌లో 200 కోట్ల లావాదేవీలు, ఆ తర్వాత 10 నెలల్లో 300 కోట్లకు లావాదేవాలు చేరుకున్నాయి. ప్రస్తుతం 400 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. కేవలం 3 నెలల్లో 100 కోట్ల లావాదేవీలు పెరగడం గమనార్హం. ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూళ్లు సైతం రికార్డు స్థాయిలో రూ.21.4 కోట్లగా నమోదయ్యాయి. ఇది రూ.3,356.74 కోట్లకు చేరుకుంది. సంఖ్యా పరంగా నెలవారీగా ఇది 10.7 శాతం, విలువ పరంగా 11 శాతం పెరిగింది.

Advertisement

Next Story