ఇకనైనా చోటు కేటాయించండి.. కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ

by Shyam |
ఇకనైనా చోటు కేటాయించండి.. కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో జాతీయ వ్యాధి నియంత్ర్ కేంద్రం(ఎన్‌సీడీసీ) నెలకొల్పాలని 2019లోనే నిర్ణయం తీసుకున్నా దానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇకనైనా ఆలస్యం చేయకుండా అనువైన చోటును కేటాయించాలని సీఎం కేసీఆర్‌కు కేంధ్ర హోం సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సోమవారం లేఖ రాశారు. నగరంలో ఇప్పటికే ఎన్ఐఎన్, సీసీఎంబీ, సీసీఐటీ లాంటి కేంద్ర పరిశోధనా సంస్థలు ఉన్నాయని, వాటికి తోడుగా ఎన్‌సీడీసీ సంస్థను కూడా నెలకొల్పడంపై కేంద్రం ఆలోచించిందని, స్థలం సమకూర్చడానికి సమ్మతమే అని లిఖితపూర్వకంగా తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఇవ్వలేదని పేర్కొన్నారు. కనీసంగా మూడు ఎకరాల విస్తీర్ణంలో స్థలం ఉంటే కొత్త భవనాలను నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా నిర్మించుకోడానికి వీలు ఉంటుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

సికింద్రాబాద్ ఎంపీగా తాను చొరవ తీసుకుని ఈ సంస్థను హైదరాబాద్‌లో నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించానని, రాష్ట్ర ప్రభుత్వం ఒక పాత భవనాన్ని చూపించిందని, కానీ అలాంటి భవనాల్లో ఎన్‌సీడీసీ లాంటి సంస్థలను నెలకొల్పడం సాధ్యం కాదనే విషయాన్ని కిషన్‌రెడ్డి నొక్కిచెప్పారు. మూడు ఎకరాల ఖాళీ స్థలాన్ని ఇవ్వాలంటూ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం 2019లోనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని, ఇప్పటికీ అది సాకారం కాలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు అవసరమైన పరిశోధనలు చేయడానికి వీలుగా, కొత్త వ్యాధులు వచ్చినప్పుడల్లా దానిపై అధ్యయనం చేయడానికి ఈ సంస్థ హైదరాబాద్‌లో నెలకొల్పడం చాలా ఉపయోగకరమని, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ తరహా చొరవ లేదని పేర్కొన్నారు.

ఎన్‌సీడీసీ కోసం కేంద్ర ప్రభుత్వం అప్పట్లోనే నిధులను కూడా కేటాయించిందని, ఇప్పటికైనా ఎలాంటి జాప్యం లేకుండా మూడు ఎకరాల మేర ఖాళీ స్థలాన్ని అప్పగిస్తే వెంటనే ఆ కేంద్రానికి అవసరమైన భవనాల నిర్మాణం మొదలవుతుందని, తొందరలోనే దాని సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు మురిగిపోకముందే రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలని ఆ లేఖలో కిషన్‌రెడ్డి కోరారు.

Advertisement

Next Story

Most Viewed