‘70 ఏండ్లైనా… బానిస మనస్తత్వం పోలేదు’

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అద్భుతంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాలు ఢిల్లీలోని తన నివాసంలో కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు జి.వివేక్, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రధాని మోడీ జన్మదినోత్సవం దేశానికి సంతోషకరమైన దినమన్న ఆయన తెలుగు ప్రజల తరపున ప్రధాని మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సమర్ధవంతమైన మోడీ నాయకత్వంలో భారత్ మరింత అభివృద్ధి చెందుతుందని, దేశ ప్రజలకు నీతి నిజాయితీతో కూడిన పాలన అందిస్తున్నారని అన్నారు. విమోచన దినోత్సవాన్ని ప్రజలు మర్చిపోరని, నిరంకుశ నిజం పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చిన రోజు అని అన్నారు.

ఎంతోమంది ఉద్యమకారుల ప్రాణత్యాగ ఫలితంగానే తెలంగాణకు విముక్తి లభించిందని, రజాకార్లు ఎంతోమంది మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డారని తెలిపారు. 70 ఏండ్లు అయినా బానిస మనస్తత్వం పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ బానిస మనస్తత్వంతోనే తెలంగాణలో పాలన కొనసాగుతుందని అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలలో విమోచన దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నా, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించకపోవడం దురదృష్టకరమని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎంఐఎం పార్టీకి బానిసగిరి చేస్తూ విమోచన దినోత్సవం జరపడం లేదని, ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవం జరపాలని డిమాండ్ చేసిన కేసీఆర్, ఇప్పుడు ఎందుకు నిర్వహించట్లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement