‘కరోనాతో ఇంకా ఎంతోకాలం పోరాడాలి’

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం అనేక మంది కరోనా బారిన పడుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ రాజ్యసభలో మాట్లాడుతూ… కరోనా మహమ్మారిపై ఇంకా ఎంతో కాలం పోరాడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోందని ఆయన స్పష్టం చేశారు. ఉత్తమ వైద్య సేవలు అందించడం వల్లనే దేశంలో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు.

‘ప్రతిరోజు 10 లక్షల కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచించిన దానికంటే ఇది చాలా ఎక్కువ. మిలియన్‌ మందికి ప్రతిరోజు 140 టెస్టులు చేయాలని డబ్ల్యూహెచ్‌వో సూచించగా ప్రభుత్వం ప్రతిరోజు మిలియన్‌కు 720 పరీక్షలు చేస్తున్నాం. సెప్టెంబర్‌ 11 నాటికి 5,51,89,229 టెస్టులు నిర్వహించాం’ అని హర్షవర్ధన్‌ వెల్లడించారు. దేశంలో లాక్‌డౌన్‌ విధించడం వల్ల లక్షల్లో కేసులు నివారించగలిగినట్లు మంత్రి పునరుద్ఘాటించారు. ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్‌ నిర్ణయం వల్ల 14-29 లక్షల కేసులు నివారించామని అన్నారు. 37-38 వేల మరణాలు తగ్గించినట్లు చెప్పారు.

Advertisement