టీఆర్ఎస్‌కు భారీ షాక్.. కారుపై వారి ‘నామినేషన్’ అస్త్రం

by Sridhar Babu |   ( Updated:2021-02-19 12:31:18.0  )
Unemployed, MLC Palla Rajeshwar Reddy
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: టీఆర్ఎస్ ప్రభుత్వం మీద గుర్రుగా ఉన్న పట్టభద్రులు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, నల్లగొండ స్థానానికి ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి మీద ఆగ్రహంతో ఉన్న యువత ఇప్పటికే ఆయనకు ఓటేయాలని ఫోన్ చేస్తున్న టెలీకాలర్లపై మండిపడుతున్న ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా కొంతమంది విద్యార్థి సంఘం నాయకులు, ఏజెన్సీ ప్రాంత విద్యార్థులు ఈ స్థానం నుంచి మూకుమ్మడిగా నామినేషన్లు వేసేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం. ఒక్కరిద్దరు కాకుండా భారీగా నామినేషన్లు దాఖలు చేసి అందరి దృష్టి మరల్చాలనే ఆలోచన ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

గతంలో మాదిరిగా..

గతంలోనూ మల్లన్న సాగర్ బాధితులు, నిజామాబాద్ పసుపు రైతులు ప్రభుత్వంపై వ్యతిరేకతను మూకుమ్మడి నామినేషన్ దాఖలు ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా భారీగా నామినేషన్లు దాఖలు చేసి చూపించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వీరికి ఇతర పార్టీల వారు కూడా పరోక్షంగా సహకరిస్తామని మాటిచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

బరిలోకి ఏజెన్సీ గిరిజనేతర పట్టభద్రులు..?

ఏజెన్సీలోని గిరిజనేతర గ్రాడ్యుయేట్లు కూడా ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. తమ ప్రాంతాల్లోనే ఉద్యోగాలకు అర్హత లేక వెనుకబడి పోతున్నామని, గిరిజన చట్టాలతో భూములు కూడా కోల్పోతున్నామని, ఏండ్లుగా దీనిని సరిదిద్దే ప్రయత్నం చేయడం లేదనే ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే వారు కూడా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలు చేసి తమ నిరసనను కూడా తెలియజేయనున్నట్టు తెలుస్తోంది. అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు కొందరు దళిత సంఘాలకు చెందిన పట్టభద్రులు సైతం పోటీచేయాలనే ఆలోచన చేస్తున్నట్లు వినికిడి.

పరోక్షంగా ఉద్యోగ సంఘాల మద్దతు

ప్రభుత్వంపై వ్యతిరేకతను నామినేషన్ల దాఖలు ద్వారా తెలపాలని భావిస్తున్న పట్టభద్రులకు పలు పార్టీల నాయకులతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. తమ సత్తా ప్రభుత్వానికి చూపించాలని ఉద్యోగ సంఘాల నేతలు రహస్యంగా మద్దతిస్తున్నట్టు సమాచారం. ప్రధాన పార్టీలకు చెందిన కొంత మంది నేతలు సైతం పట్టభద్రులతో ఎక్కువగా నామినేషన్లు దాఖలు చేయిస్తే కలిసొస్తుందనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, ప్రత్యర్థుల కదలికలను గమనిస్తున్న అధికారపార్టీ నేతలు మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు మొదలెట్టారని కూడా తెలుస్తోంది.

‘పల్లా’ టెలీకాలర్లకు చుక్కలు..

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటేయాలంటూ ఫోన్లు చేస్తున్న టెలీకాలర్లకు నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లు చుక్కలు చూపిస్తున్నారు. కొన్ని రోజులుగా టెలీకాలర్లతో విద్యార్థుల సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పమ్మి గ్రామానికి చెందిన ఓ ప్రైవేట్ టీచర్ లాక్ డౌన్ కాలంలో 10 నెలల జీతాలు లేక ఇబ్బందులు పడుతుంటే పల్లా సీఎంతో ఒక్క ప్రకటన కూడా చేయించలేకపోయాడని మండిపడిన విషయం కూడా ఇప్పుడు వైరల్​ అవుతోంది. మొత్తంగా అటు ప్రభుత్వంపై, ఇటు పల్లా రాజేశ్వర్ రెడ్డిపై అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది.

Advertisement

Next Story