సొంత తమ్మున్నే దారుణంగా మట్టుబెట్టిన అన్నలు..

by Sumithra |
సొంత తమ్మున్నే దారుణంగా మట్టుబెట్టిన అన్నలు..
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : చెడు వ్యసనాలకు బానిసై తోడబుట్టిన వారిని చంపుతానని బెదిరిస్తున్న యువకుడిని కుటుంబ సభ్యులే మట్టుబెట్టిన సంఘటన ఆదివారం మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. మంగళ్ హాట్ గుఫానగర్‌లో నివాసముండే దుర్గమ్మకు ప్రసాద్ (22), నరేందర్ (25), రవీందర్ (28) ముగ్గురు కుమారులు.

రవీందర్ కారు డ్రైవర్‌గా పని చేస్తూ మియాపూర్ బొల్లారంలో నివాసముంటన్నాడు. నరేందర్ అలియాస్ మహేందర్ గుఫానగర్‌లో పూల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు ప్రసాద్ తాగుడుకు బానిసై తరచూ ఇంట్లో వాళ్లను కొట్టడంతో పాటు వేధింపులకు గురి చేస్తున్నాడు. అతని బాధలు భరించలేక సుమారు ఆరు నెలల క్రితం మహేందర్ తన భార్య, పిల్లలు, తల్లి దుర్గమ్మతో కలిసి అద్దె ఇంట్లోకి మారాడు. అయినా ప్రసాద్ తన తీరు మార్చుకోకుండా తరచుగా ఫోన్‌లు చేసి వారిని చంపుతానంటూ బెదిరింపులకు గురి చేస్తున్నాడు. దీంతో నరేందర్, రవీందర్‌లు ప్రసాద్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగా బొల్లారంలో నివాసముండే రవీందర్ శనివారం సాయంత్రం గుఫానగర్‌లోని తన తమ్ముని ఇంటికి వచ్చాడు. రాత్రంతా ప్రసాద్ కోసం ఎదురు చూడగా ఆదివారం తెల్లవారుజామున మద్యం మత్తులో ఉన్న ప్రసాద్ ఇంటికి చేరుకోగా అతనితో అన్నలు ఇద్దరు మాట్లాడే ప్రయత్నం చేయగా వారిని చంపుతానని ప్రసాద్ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇంట్లోని సామాగ్రిని విసిరేస్తూ అడ్డం వచ్చిన వారిపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో నరేందర్, రవీందర్‌లు ఇద్దరు ఇంట్లో ఉన్న చున్నీని ప్రసాద్ గొంతుకు బిగించి ఊపిరి ఆగిపోయేంత వరకు లాగారు. ప్రసాద్ చనిపోయినట్లు నిర్ధారించుకున్నాక ఏమీ తెలియనట్లే ఇంట్లోనే ఉన్నారు.

ఉదయం చుట్టు పక్కల వారు గమనించి ప్రసాద్ ఎలా చనిపోయాడని ప్రశ్నించగా తామే హత్యచేశామని అంగీకరించారు. సమాచారం అందుకున్న మంగళ్ హాట్ ఇన్ స్పెక్టర్ రణవీర్ రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మర్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed