కరోనా లాక్ డౌన్ లో ఏం కొనేటట్లు లేదు..

by Shyam |
కరోనా లాక్ డౌన్ లో ఏం కొనేటట్లు లేదు..
X

దిశ, న్యూస్​బ్యూరో:
ఉద్యోగాలకు పోక, వ్యాపారాలు నడవక, కూలీ దొరుకక ఇంటి వద్దనే ఉంటున్నవారిపై మరో బాంబు పడింది. లాక్​డౌన్​ రోజులను ఎలా నెట్టుకురావాలా అని ఆలోచిస్తుండగానే నిత్యావసరాల ధరలు వేగంగా పైకి ఎగబాకుతున్నాయి. మార్చి 22న లాక్ డౌన్ ప్రకటించే నాటికి వున్న ధరలతో పోల్చితే ప్రస్తుతం ధరలు బాగా పెరిగాయి. ముఖ్యంగా ఎమ్మార్పీ ధర ముద్రించని, లూజుగా అమ్మే బియ్యం, పప్పుదినుసులు, చక్కెర, పిండి వగైరా వస్తువుల ధరల పెరుగుదలకు అంతేలేకుండాపోయింది. పెద్ద పెద్ద మాల్స్ లో, సూపర్ మార్కెట్లలో చాలావరకు సరుకుల స్టాకు అయిపోయి ర్యాక్స్ ఖాళీగా దర్శనమిస్తుండగా ఆయా కాలనీల్లో ఉండే హోల్ సేల్, కిరాణా దుకాణాల్లో ఉన్న వస్తువులనే రేట్లు పెంచి అమ్ముతున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పినా ఫలితం మాత్రం కనపడడంలేదు. కాగా, లాక్​డౌన్​ మరిన్ని రోజులు పొడిగిస్తే పేద, మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి దారుణంగా తయారయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం అవుతున్నది.

లాక్​డౌన్​ రోజుల్లో కూరగాయలు, నిత్యావసరాలకు మినహాయింపునిస్తున్నామని ప్రకటించడంతో ప్రజలు ఊరట చెందారు. అయితే, చాలాచోట్ల రెట్టింపు ధరలకు కూరగాయలు, ఆకుకూరలు విక్రయించడంతో ప్రభుత్వం నియంత్రణ చర్యలకు పూనుకుంది. మార్కెట్​ ధర ప్రకారమే అమ్మకాలు జరపాలని ప్రకటించింది. ప్రభుత్వాదేశాలను ఉల్లంఘించినవారిపై జరిమానాలు కూడా విధించింది. దీంతో కూరగాయల ధరల్లో భారీ పెరుగుదలకు అడ్డుకట్ట పడింది. నిత్యావసరాలు అమ్మే దుకాణాల మీద కూడా అలాంటి నిబంధననే అమలు చేస్తామని ప్రకటించినా అమలు కావడం లేదు. అంతకుముందున్న ధరలతో పోలిస్తే 20–50 శాతం వరకూ ధరలు పెరిగిపోయాయి. ప్యాకేజ్​డ్​, ఎంఆర్​పీ ముద్రించి ఉన్న వాటిపై ధరలు పెరగలేదని, పప్పులు, పల్లీలు, పిండి, అల్లం, వెల్లుల్లి వంటి లూజ్​ అమ్మకాలు చేసే వస్తువుల ధరల్లోని పెరుగుదలనే దుకాణదారులు చూపిస్తున్నారు. లాక్​డౌన్​కు ముందు రూ.100కు కిలో అల్లం లేదా వెల్లుల్లి వచ్చేది. ఇప్పుడు రూ.200కు పెరిగింది. లాక్​డౌన్​ ముందురోజు నుంచి ఇప్పటివరకు పది రోజుల్లోనే వీటి ధర రెట్టింపు అయ్యింది. చక్కెర రూ.37 నుంచి రూ.50కి చేరుకుంది. రోజూ ఎక్కువగా వాడే పప్పుల ధరలైతే కొనేందుకు అవకాశం కూడా ఇవ్వడం లేదు. కంది, పెసర, శనగపప్పు ధరలు 40 శాతం పెరుగుదలతో కనిపిస్తున్నాయి. పది రోజుల్లోనే ధరలు రెట్టింపు పెరిగాయంటే.. ఇంకా లాక్​డౌన్​ కాలాన్ని పెంచితే నాలుగు, ఐదు రెట్లు పెరిగిపోతాయమోననే భయం వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో వస్తువులు కొనుగోలు చేసేందుకు కుటుంబాలు అవస్థలు పడనున్నట్టు కనిపిస్తోంది. కొనుగోలు చేద్దామన్నా మార్కెట్లలో వస్తువుల నిల్వలు కూడా తగ్గిపోతున్నాయి.

సూపర్​ మార్కెట్లలో కొంత నయం..

గతంతో గమనిస్తే సూపర్​ మార్కెట్లలో ‘లాక్​డౌన్’ ధరలు కొంత ఊరటనిస్తున్నాయి. స్థానిక హోల్ సేల్, రిటైల్ షాపులతో పోలిస్తే సూపర్​ మార్కెట్లు ధరల నిబంధనలను పాటిస్తున్నట్టు కనిపిస్తోంది. అప్పటికీ, ఇప్పటికీ నిత్యావసరాల ధరల్లో భారీ పెరుగుదల కనిపించడం లేదు. కానీ, సూపర్​ మార్కెట్లలో ఇప్పటికే చాలా వస్తువుల స్టాకు అయిపోయింది. చాలా వరకు ఖాళీ ర్యాక్స్ దర్శనమిస్తున్నాయి. దాంతో ప్రజలు స్థానిక దుకాణాలకు వెళ్లక తప్పడంలేదు. బోడుప్పల్​లోని ఓ ప్రముఖ రిటైల్​ మార్కెట్​లో ఇడ్లీ రవ్వను పది రోజుల వ్యవధిలోనే రెండుసార్లు తెప్పించారు. అయినా, ప్రజలకు స్టాకు అందుబాటులో ఉండడంలేదు. అయినా, హైదరాబాదు, వరంగల్, కరీంనగర్ లాంటి కొన్ని నగరాల్లో మినహాయిస్తే తెలంగాణలో సూపర్ మార్కెట్ల వ్యవస్థ అంతగా లేదన్న విషయం తెలిసిందే.

స్తంభించిన రవాణా​..

లాక్​డౌన్​ రోజుల్లో నిత్యావసరాలకు మినహాయింపునిచ్చారు. ఆయా దుకాణాలు, ట్రాన్స్​పోర్ట్​ వాహనాలకు కూడా పర్మిషన్​ ఉంది. అయితే, వస్తువుల సరఫరాకు అవసరమైన డ్రైవర్లు, కూలీలు కరోనా భయానికి బయటకు రావడం లేదు. పని ఉన్నా లేకపోయినా పర్వాలేదు. కానీ, వైరస్​ బారిన పడతామేమోననే భయాందోళన ప్రభావం ఈ రంగంపై బాగా కనిపిస్తోంది. గోడౌన్లలో, ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి లూజ్​ మెటీరియల్​ను హోల్‌సేల్​ దుకాణాలకు, అక్కడి నుంచి రిటైలర్లకు, చిరు వ్యాపారులకు, గ్రామాలకు పంపాల్సివుంటుంది. ఈ ట్రాన్స్​పోర్ట్​ వ్యవస్థ ఇప్పుడు పనిచేయడం లేదు. ప్రాణభయంతో కూలీలు పట్నాలు విడిచి సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. యజమానులు బతిమిలాడినా విధులకు రావడానికి వారు సుముఖంగా లేరు. పైగా రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. దీంతో నిత్యావసరాల సరఫరా ఆగిపోయింది. హోల్​సేల్​, రిటైల్​ దుకాణదారులు తమ వద్ద ఉన్న నిల్వలు అమ్ముకోవడమే తప్ప కొత్తగా సరుకులు వచ్చేది లేదు. కొత్తగా సరుకులు వచ్చినా గతంతో పోలిస్తే ఒక్కో దుకాణానికి 10 శాతం సరుకులు మాత్రమే ఇస్తున్నారు. వచ్చినవారికి కూలీలు, బత్తాలు కూడా కొంచెం ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఉన్న వస్తువులపై ధరలు పెంచక తప్పడం లేదని హోల్​సేల్​ వ్యాపారులు చెబుతున్నారు. కొన్ని రోజులంటే నెట్టుకురావచ్చు గానీ.. నెలలపాటు కష్టమేనని వారు వివరిస్తున్నారు.

లాక్ డౌన్ కొనసాగితే కష్టమే..

లాక్​డౌన్​ ఇలాగే కొనసాగితే నెల తర్వాత మార్కెట్​లో ప్రజలకు అవసరమైనన్ని సరుకులు అందుబాటులో ఉండడం సాధ్యం కాదు. ఫలితంగా డిమాండ్-సప్లయ్​ విధానం ప్రకారం అప్పుడు వాటి ధరలు ఆకాశానికి ఎగబాకుతాయి. పెరిగిన ధరలతో సరుకులు కొనలేక, తినలేక ప్రజలు ఆకలితో అలమటిస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో లాక్​డౌన్​ కొనసాగించాల్సి వస్తే.. ముందస్తు చర్యలు తీసుకోకుంటే పరిస్థితి తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో దుకాణాలపై దాడులు చేసి ప్రజలు ఆహార వస్తువులు ఎత్తుకెళ్లారు. మన దగ్గర ఇలాంటి ఘటనలు జరగకముందే ప్రభుత్వాలు మేలుకుని నిత్యావసరాల రవాణాలో ఉన్న ఇబ్బందులను తొలగించాల్సిన అవసరముంది.

ధరల్లో మార్పు

వస్తువు మార్చి 15 ఏప్రిల్​03
చక్కెర 37 50
కంది పప్పు 80 130
పెసర పప్పు 100 140
శనగ పప్పు 40 60
ఉల్లిగడ్డ 26 40
పల్లీలు 100 140
వెల్లుల్లి 100 200
అల్లం 100 200

👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed