మూడు వారాల ప్రెగ్నెంట్‌కు మరో ప్రెగ్నెన్సీ..!!

by Anukaran |
pregnancy to 3 weeks pregnant
X

న్యూఢిల్లీ: వినడానికి విచిత్రంగా ఉన్నా, ఇది నిజం. మూడు వారాల గర్భవతి మరో గర్భం దాల్చి అరుదైన ‘సూపర్ ట్విన్స్‌’కు జన్మనిచ్చింది. మూడు వారాల తేడాతో గర్భం దాల్చినా, వీరిరువురికీ ఒకే రోజు జన్మనిచ్చింది. ఈ అరుదైన అనుభవం ఇంగ్లాండ్‌కు చెందిన రెబాకా రాబర్ట్స్‌కు ఎదురైంది. రెబాకా రాబర్ట్స్, రైస్ వీవర్‌ దంపతులు కొన్నేళ్లుగా సంతానం కోసం చికిత్స తీసుకుంటున్నారు. గతేడాది తమ ఆశలు ఫలించినట్టు వైద్యుల ద్వారా తెలుసుకున్నారు. రెబాకా గర్భం దాల్చినట్టు వైద్యులు చెప్పిన కబురు ఆ దంపతులను సంతోష సంద్రంలో ముంచింది. కానీ, ఆ దంపతులు 12 వారాల గర్భ సమయంలో నమ్మశక్యం కాని వార్త విన్నారు. రెబాకా గర్భంలో మరో బేబీని వైద్యులు గుర్తించడం అటు వైద్యులను, ఇటు దంపతులను షాక్‌కు గురిచేసింది. ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.

‘తన కడుపులో ఇద్దరు పెరుగుతున్నట్టు వైద్యులు చెప్పడంతో షాక్‌కు గురయ్యా. సైజులో మూడు వారాల తేడాతో రెండు పిండాలు అభివృద్ధి చెందుతున్నాయని అప్పుడే డాక్టర్లు చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించిన వైద్యులూ గందరగోళంలో పడ్డారు’ అని రెబాకా చెప్పుకొచ్చారు. ఇది అరుదుల్లోకెల్లా అరుదైనదని ఆమె డాక్టర్ డేవిడ్ వాకర్ అన్నారు. రెండు వేర్వేరు సందర్భాల్లో ఓవరీ నుంచి ఎగ్స్ రిలీజ్ కావడంతో ఇలా జరిగి ఉండొచ్చని తెలిపారు.

రెండో పిండం బలహీనంగా ఉన్నదని, బహుశా ఆమె బతకలేకపోవచ్చుననీ వైద్యులు తెలిపారు. కానీ, రెబాకా తన అరుదైన గర్భంపై చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గతేడాది ఎట్టకేలకు ఇరువురికి బాబు(నోవా), పాప(రోసలీ)కు జన్మనిచ్చారు. మూడు వారాలు పెద్దదైన నోవా జన్మించిన మూడు వారాలకు నియోనాటల్ ఐసీయూనుంచి బయటకు రాగా, రోసలీ మాత్రం 95 రోజులు అక్కడే వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వచ్చింది. చివరికి ఇరువురూ ఆరోగ్యంగా ఇల్లు చేరారు. ఇక ఈ అరుదైన అదృష్టాన్ని ఎంజాయ్ చేస్తామని రెబాకా సంబరపడిపోతూ తన అనుభూతిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

పిల్లి వల్ల గర్భం దాల్చిన మహిళ.. షాక్ లో భర్త

Advertisement

Next Story

Most Viewed