రెండు గంటలు ఏం చేయకున్నా మిలియన్ల వీక్షణలు

by Anukaran |   ( Updated:2020-08-01 02:41:02.0  )
రెండు గంటలు ఏం చేయకున్నా మిలియన్ల వీక్షణలు
X

యూట్యూబ్‌లో వైరల్ వీడియోలను చూస్తే, వాటి వీక్షణలు మిలియన్ల కొద్దీ ఉంటాయి. అయితే ఆ వీడియోల్లో ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్‌ను సృష్టించడంలో వీడియో చేసిన వారి కష్టం దాగుంటుంది. అవన్నీ పది నిమిషాల నుంచి ఒక గంట నిడివిని కలిగి ఉంటాయి. దాదాపు రెండు గంటల వైరల్ కంటెంట్‌ను ఒక్కడే యూట్యూబర్ తయారుచేయాలంటే చాలా కష్టం. కానీ ఇండోనేషియాకు చెందిన ఓ రెండు గంటల వీడియో ఇప్పుడు చాలా వైరల్ అవుతోంది. అసలు ఆ వీడియోలోని కంటెంట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు. ఇంతకీ ఆ వీడియోలో ఏం చేశాడో తెలుసా? రెండు గంటల పాటు ఖాళీగా కూర్చున్నాడు. అవును.. ఊరికే కెమెరాను తదేకంగా చూస్తూ రెండు గంటలు కూర్చున్నాడు. ఇప్పుడు ఆ వీడియోకు దాదాపు 2 మిలియన్ల వీక్షణలు వచ్చాయి.

‘2 గంటలపాటు ఏం చేయకుండా ఉండటం’ అనే పేరుతో ఇండోనేషియన్ యూట్యూబర్ మహ్మద్ దిడిత్.. ఈ వీడియోను జులై 10న పోస్ట్ చేశాడు. ఈ వీడియో చేయడానికి వెనకున్న అర్థాన్ని కూడా దిడిత్ బయటపెట్టాడు. తను రెగ్యులర్‌గా చేస్తున్న వీడియోల కింద యువతకు ఉపయోగపడే వీడియోలు చేయాలని చాలా మంది సలహాలిస్తున్నారట. అందుకే వారి సలహా మేరకు దిడిత్ ఈ వీడియో చేశాడు. ఇందులో ఉపయోగం ఏముందని అడిగితే.. అది మీరే తెలుసుకోవాలి, ఇప్పుడు యువత దగ్గర రెండు గంటలు కాదు, 24 గంటల ఖాళీ సమయం ఉంది, ఎవరూ ఉపయోగపడే పని చేయడం లేదనేది ఈ వీడియో నిగూఢార్థమని దిడిత్ అంటున్నాడు. దిడిత్ అన్నదే నిజమని.. ఈ వీడియోకు వచ్చిన వీక్షణలు చూస్తే తెలుస్తోంది. అంతేకాకుండా దిడిత్ ఎంతసేపు కనురెప్పలు కొట్టాడో లెక్కపెట్టి కామెంట్ చేసిన వాళ్లు, వారి లెక్క తప్పు అంటూ మరొకరు మళ్లీ లెక్కపెట్టి కామెంట్ చేయడాలు చూస్తుంటే యువత నిజంగానే చాలా ఖాళీగా ఉన్నారనిపిస్తోంది.

Advertisement

Next Story