‘డబ్బులు సంపాదించేందుకే ఇలా చేశాం’

దిశ, కుత్బుల్లాపూర్: అతను లారీ డ్రైవర్.. స్నేహితుడు ఆటో డ్రైవర్. చేసేది బతుకు దెరువు కోసమే కానీ, వారి స్నేహం నేరాలు చేసేంత వరకు వెళ్లింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో పనులు లేక ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నారు. సులువుగా సంపాదనే ధ్యేయంగా ఇద్దరు కలిసి వైజాగ్ లో తెలిసిన యువకుడికి ఫోన్ చేసి గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. అలా అనకాలపల్లి టు కొంపల్లికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో గంజాయిని తీసుకువస్తూ వ్యాపారం విజయవంతం కాకముందే అడ్డంగా బుక్కయ్యారు. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో బాలానగర్ డీసీపీ పద్మజ, ఏసీపీ నర్సింహారావు, సీఐ రమేష్ లు వివరాలను వెళ్లడించారు. ఆ వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ సర్కిల్ గాంధీనగర్ లోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఉండే ఎండీ సిరాజుద్దీన్(38) లారీ డ్రైవర్ గా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. లాక్ డౌన్ కారణంగా పని లేకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో తనకు తెలిసిన ఆటో డ్రైవర్ మదన్ ను సూరారంలో కలిశాడు. దీంతో వీళ్లదరూ ఏం చేద్దామని ఆలోచించారు. ఈ సమయంలో మదన్ వైజాగ్ లో ఉండే సంజయ్ కు ఫోన్ చేసి గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం గంజాయి ఎలా విక్రయించాలో అనే అంశాలపై తన సొంతూరు మహారాష్ట్రలోని తెలిసిన వారికి మదన్ ఫోన్ చేసి ఆ వివరాలు తెలుసుకున్నాడు. అనంతరం ఈనెల 2న సిరాజుద్దీన్ తనకు తెలిసిన స్నేహితుడు నయీం వద్ద ఓ వాహనాన్ని తీసుకెళ్లాడు. అనంతరం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కోళ్లకు సంబంధించిన మందులుగా నమ్మించి 30 కిలోల గంజాయి ప్యాకెట్లను పార్సిల్ చేశారు. అక్కడి నుంచి ట్రావెల్స్ బస్సు వెనకాలే వాహనంలో సిరాజుద్దీన్, మదన్ లు బయలుదేరారు. ఈనెల 5న ఉదయం 8 గంటలకు కొంపల్లి చౌరస్తాకు రాగానే ఆ వాహనాన్ని బస్సుకు అడ్డుగా పెట్టి మా పార్సిళ్లను ఇక్కడే ఇవ్వాల్సిందిగా కోరారు. ఇందుకు బస్సు డ్రైవర్ నిరాకరించడంతో వారి మధ్య కాసేపు గొడవ జరిగింది. వెంటనే ఆ బస్సు డ్రైవర్ 100 నెంబర్ కు ఫోన్ చేయగా పెట్రోలింగ్ వాహనం, ఆ వెంటనే ఎస్సై రాంబాబులు అక్కడికి చేరుకుని గొడవను శాంతింపచేశారు. ఈ క్రమంలో అనుమానంతో అందులో ఏం పార్సిళ్లు ఉన్నాయో అని పరిశీలించారు. దీంతో విషయం బయటపడింది. ఇంతలోనే ప్రధాన నిందితుడు మదన్ పరారవ్వగా సిరాజుద్దీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.10 లక్షల విలువైన గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మదన్ తో పాటు సంజయ్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు డీసీపీ పద్మజ తెలిపారు. చాక చక్యంగా వ్యవహరించిన సీఐ రమేశ్, ఎస్సై రాంబాబు, బృందాన్ని అభినందించి రివార్డు కోసం పంపిస్తామని వెళ్లడించారు.

Advertisement