ఎడిట్ బటన్ ఇస్తానంటున్న ట్విట్టర్.. కానీ ఒక షరతు!

by  |
ఎడిట్ బటన్ ఇస్తానంటున్న ట్విట్టర్.. కానీ ఒక షరతు!
X

ట్విట్టర్‌లో ఒకసారి పోస్టు చేశాక అందులో ఏమన్నా తప్పులుంటే ఎడిట్ చేసుకునే సదుపాయం ఉండదు. అందుకే డొనాల్డ్ ట్రంప్, పాకిస్థానీ క్రికెట్ బోర్డు వంటి వారు ట్వీట్లు చేసినపుడు తప్పులు దొర్లితే వాటిని స్క్రీన్ షాట్లు తీసుకుని మరీ నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. దీంతో వారు ట్వీట్ డిలీట్ చేయక తప్పని పరిస్థితి. అదే ఒక ఎడిట్ ఆప్షన్ ఉంటే తప్పు కనిపించగానే దాన్ని ఎడిట్ చేసి, డిలీట్ చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఆప్షన్ కోసం ట్విట్టర్ జనాలు ఎప్పట్నుంచో అడుగుతున్నారు. వారి అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని ట్విట్టర్ ఒక కొత్త అప్‌డేట్ ప్రకటించింది. వారి కోరిక మేరకు ఎడిట్ బటన్ ఇస్తామని అంగీకరించింది కానీ..

ఒక షరతు విధించింది. ఇప్పుడు కరోనా సమయం కాబట్టి మాస్క్‌లు, సామాజిక దూరం పాటించాల్సిన ఆవశ్యకత పెరిగింది. ఎన్ని రకాలుగా చెప్పినా జనాలు పెద్దగా కేర్ చేయడం లేదు. అందుకే ఈ విషయాన్ని ట్విట్టర్ కూడా సీరియస్‌గా తీసుకుని, తమ ఎడిట్ బటన్‌కు దీనికి లింకు పెట్టింది. అందరూ మాస్క్‌లు ధరించిన రోజే ఎడిట్ బటన్ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. అంటే ఎడిట్ బటన్‌ను ఇచ్చే యోచనలో ట్విట్టర్ లేదని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అందరూ మాస్క్‌లు వేసుకునే రోజు రానే రాదు. దీని గురించి గతంలో కూడా ట్విట్టర్ సహ-వ్యవస్థాపకుడు జాక్ డోర్సే స్పష్టతనిచ్చారు. ట్వీట్ ఎడిట్ చేసే బటన్ ఇచ్చే ప్రసక్తే లేదని గతంలో ఆయన చెప్పారు. అయినప్పటికీ వినియోగదారులు తరచుగా అడుగుతుండటంతో ఇలా మెలికపెట్టినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed