Twitter :‘షాపింగ్ మాడ్యూల్’ ఫీచర్ ప్రారంభించిన ట్విట్టర్

by Harish |   ( Updated:2021-07-29 08:55:36.0  )
Twitter :‘షాపింగ్ మాడ్యూల్’ ఫీచర్ ప్రారంభించిన ట్విట్టర్
X

దిశ, ఫీచర్స్ : ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘ట్విట్టర్’​ తాజాగా ‘షాప్ మాడ్యూల్’ అనే ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యాపారాలు తమ బ్రాండ్స్‌ను వారి ప్రొఫైల్‌ పైభాగంలో ప్రమోట్​ చేసుకునేందుకు వీలుగా ఈ ఫీచర్ లాంచ్ చేసింది ట్విట్టర్. అంతేకాదు, యూజర్లు అక్కడే షాపింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ట్విట్టర్ కూడా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ దారిలోనే వెళుతుంది. ఇప్పటికే ఈ రెండు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ ‘షాప్స్’ పేరుతో ఈ తరహా ఫీచర్ ప్రారంభించాయి. కస్టమర్స్ నేరుగా ఇందులో ప్రొడక్ట్స్ కొనుగోలు చేసుకోవచ్చు.

ట్విట్టర్ ‘షాప్ మాడ్యూల్’ను ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా దీన్ని ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది. అమెరికాలోనే అందుబాటులోకి తెచ్చిన ఈ ఫీచర్ ద్వారా యూజర్లు సులభంగా ఉత్పత్తులను బ్రౌజ్​ చేసుకొని అక్కడికక్కడే కొనుగోలు చేయవచ్చు. ఏదైనా ప్రొడక్ట్‌పై క్లిక్​ చేయగానే దాని ధర, పేమెంట్ ​ఆప్షన్ అన్ని వివరాలు అక్కడే కనిపిస్తాయి. ట్విట్టర్ నుంచి మరో షాపింగ్ సైట్‌కు వెళ్లకుండా అక్కడే పేమెంట్​ చేసి ఆ ప్రొడక్ట్‌ను కొనుగోలు చేయవచ్చమన్న మాట. యూజర్లకు మెరుగైన షాపింగ్​ అనుభవాన్ని అందించాలనే ఉద్దేశంతో ట్విట్టర్ దీన్ని లాంచ్ చేసింది. ఇందులో భాగంగా గేమ్‌స్టాప్, ఆర్డెన్ కోవ్ వంటి పది బ్రాండ్లతో ట్విట్టర్​ ఒప్పందం చేసుకుంది. ట్విట్టర్ 2015 లోనే ‘బై నౌ బటన్’, ‘ప్రొడక్ట్ పేజెస్’లతో ప్రయోగాలు చేసింది. మొదట్లో యుఎస్ వినియోగదారులలో కొద్ది శాతం మందికి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది, కానీ ట్విట్టర్ ఇతర ఫీచర్స్‌పై దృష్టి పెట్టడంతో దీన్నుంచి తప్పుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు ‘షాపింగ్ మాడ్యూల్’ ఫీచర్‌ను తీసుకొచ్చింది.

పైలట్ ప్రాజెక్ట్ సమయంలో ప్రజలు ట్విట్టర్‌లో ఇష్టపడే షాపింగ్ అనుభవాల గురించి తెలుసుకోవడంతో పాటు, మరిన్ని బ్రాండ్లతో భాగస్వామ్యం కావడానికి కూడా కృషి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed