- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెరుచుకున్న తిరుమల
దిశ, ఏపీ బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానం తెరుచుకుంది. లాక్‌డౌన్ సడలింపులతో 75 రోజుల అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కలుగనుంది. ఈ మేరకు టీటీడీ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో వంద మంది దేవాలయ ఉద్యోగులతో శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించారు. సామాజిక దూరం పాటిస్తూ దర్శనాలు చేసుకున్నారు. గంటకు 500 మంది భక్తుల చొప్పున రోజుకు కేవలం 7,000 మంది భక్తులకే దర్శన భాగ్యం కలుగనుంది. ఈ నెల 8, 9వ తేదీల్లో ప్రయోగాత్మకంగా ఉద్యోగులకు, 10వ తేదీన స్థానిక భక్తులను అనుమతించనున్నారు. ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న 3 వేల మందికి, నేరుగా వచ్చే మరో 3 వేలమందికి శ్రీవారి దర్శనం ఏర్పాటు చేస్తామని టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు భక్తులకు మార్గదర్శకాలు విడుదల చేసింది.
వైద్య పరీక్షలు నిర్వహించాకే..
ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ వైద్య పరీక్షలు నిర్వహించాకే స్వామివారి దర్శనానికి టీటీడీ అనుమతి ఇవ్వనుంది. కంటైన్మెంట్ జోన్ల నుంచి భక్తులు దర్శనానికి రావొద్దని సూచించింది. 65 ఏళ్లు పైబడినవారికి, పిల్లలకు దర్శనాలు ఉండవని తెలిపింది. ఈ నెల 11 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం ఒక గంట సమయాన్ని మాత్రమే (ఉదయం 6.30 నుంచి 7.30గంటల వరకు) కేటాయించగా, 7.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు సాధారణ భక్తులకు అనుమతి ఉంటుంది. మెట్ల మార్గం ద్వారా అనుమతి ఉండదని, ఈ మార్గాన్ని కొన్నాళ్ల పాటు మూసివేయనున్నట్టు టీటీడీ తెలిపింది. అలిపిరి నుంచి మాత్రమే భక్తులకు కాలినడకన అనుమతి ఉంటుంది. అదికూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే. అలాగే, కనుమ దారుల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే అనుమతి ఉంటుంది. శ్రీవారి పుష్కరిణిలోకి కూడా అనుమతి లేదు. వసతి గదుల్లో గదికి ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది. అదికూడా ఒక్క రోజు ఉండేందుకే. రెండు గంటలకోసారి క్యూలైన్లను శానిటైజ్ చేస్తారు. శఠారి, తీర్థప్రసాదాలు ఇవ్వరు. హుండీ వద్దకు వెళ్లేవారికి హెర్భల్ శానిటైజేషన్ ప్రక్రియ ఉంటుంది. తిరుమలలో ప్రైవేటు హోటల్స్ నిర్వహణకు అనుమతి లేదు. టీటీడీలో 500 మంది సిబ్బందికి పీపీఈ కిట్లు ఇచ్చే అవకాశముంది. ప్రతి 2 గంటలకోసారి లడ్డూ కౌంటర్లు మారుస్తారు. అలాగే, ఈ నెల 8 నుంచి టీటీడీ కల్యాణ మండపాలు, టికెట్ కౌంటర్ల వద్ద లడ్డూ విక్రయాలు నిలిచిపోనున్నాయి. టీటీడీతో పాటు దాని అనుబంధ ఆలయాల్లోనూ ఇవే నిబంధనలు అమలు చేయనున్నారు.