పేపర్ టు ఆన్‌లైన్.. స్మాట్ వర్క్ దిశగా తెలంగాణ

by  |
పేపర్ టు ఆన్‌లైన్.. స్మాట్ వర్క్ దిశగా తెలంగాణ
X

ఇక తెలంగాణలో పరిపాలన పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఏపీలో ఈ విధానం చాలా కాలంగా అమలులో ఉంది. మన దగ్గర ఒకటి, రెండు జిల్లాల్లో మాత్రమే ఈ విధానం కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో ఇక అంతటా ‘ఈ-ఆఫీసు’ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాలన సక్రమంగా సాగడమే కాకుండా ఫైళ్లు కూడా జాప్యం లేకుండా క్లియర్ అవుతాయని భావిస్తోంది. ఇందుకు కావలసిన పరికరాలను సమకూర్చాలని ఐటీ శాఖను ప్రభుత్వం ఆదేశించింది.

దిశ, న్యూస్ బ్యూరో :
కొవిడ్-19 కారణంగా ప్రభుత్వ కార్యకలాపాలు నెమ్మదిగా సాగుతున్నాయి. వీటిని పరుగులు పెట్టించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అన్ని ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ‘ఈ-ఆఫీసు’ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిర్ణయించింది. జూలై రెండో వారం చివరికల్లా ఇది అందుబాటులోకి వచ్చేలా చూడాలని వివిధ శాఖలు, విభాగాల ఉన్నతాధికారులను ఆదేశించింది. ఇందుకోసం ప్రతీ శాఖకు స్కానర్లు, కంప్యూటర్లను అదనంగా సమకూరుస్తోంది. ఏయే స్థాయిల ఉద్యోగులు వీటిని వాడాలో ఇప్పటికే ఖరారు చేసినందున, వారి డిజిటిల్ సంతకాలతోపాటు లాగిన్ ఐడీ, యూజర్ నేమ్ లాంటివన్నింటినీ నిర్వాహకులు సేకరిస్తున్నారు. ప్రతి శాఖలో దీన్ని పటిష్టంగా అమలుచేయడానికి ఒక నోడల్ అధికారిని, సాంకేతికంగా సాయం అందించడానికి నిపుణుడైన అసిస్టెంట్‌ను నియమించనున్నారు. వీరికి త్వరలోనే శిక్షణ కూడా ఇవ్వనున్నారు.

ఎందుకోసం ఈ నూతన విధానం?
ప్రస్తుతం ఒక శాఖ నుంచి మరో శాఖకు భౌతికంగా ఫైళ్లు తీసుకెళ్లాల్సి వస్తోంది. కరోనా వైరస్ సోకుతుండడంతో కొద్దిమంది ఉద్యోగులు ఐసొలేషన్‌లోకి, చాలా మంది ఉద్యోగులు క్వారంటైన్‌లోకి వెళ్తున్నారు. కార్యాలయాలు మూతపడుతున్నాయి. రోజువారీ పనులకు అంతరాయం కలుగుతోంది. ఫైళ్లను తీసుకెళ్లే వ్యక్తుల ద్వారా వైరస్ వ్యాపిస్తోందన్న అనుమానంతో అధికారులు ఇతర కార్యాలయాల నుంచి లేదా ఇళ్ల నుంచే పనులు చేస్తున్నారు. సచివాలయంలోని ఆర్థిక శాఖ బ్లాక్‌లో పనిచేసే కొద్దిమందికి వైరస్ సోకడంతో సిబ్బందిని ఇళ్లకు పంపాల్సి వచ్చింది. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కొంతకాలం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం నుంచి పనులు చేశారు. ఆ తర్వాత నివాసం నుంచే పని చేస్తున్నారు. ఇలా చాలా శాఖల్లో పనులు పరిమితులతో జరుగుతున్నాయి. దీన్ని అధిగమించడం కోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్‌ఫర్మాటిక్స్ సెంటర్ సాంకేతిక సహకారంతో రూపొందిన’ఈ-ఆఫీస్’ సాఫ్ట్‌వేర్‌ను వాడాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. దీని ద్వారా ఆయా విభాగాలలోని సెక్షన్ ఆఫీసర్లు, సిబ్బంది ఫైళ్లను స్కాన్ చేసి కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తారు. వీటిని అవసరమున్న అధికారులకు, శాఖకు ‘ఈ-ఆఫీస్’ సాఫ్ట్‌వేర్ ద్వారా పంపుతారు. అలా పంపిన తర్వాత సంబంధిత అధికారి మొబైల్ కు ఎస్ఎంఎస్ వెళ్తుంది. అనంతరం పని మొదలవుతుంది.

పెరగనున్న వేగం..
వైరస్ వ్యాప్తిని నివారించడంతో పాటు పనులకు ఆటంకం లేకుండా ఉండేలా కొత్త విధానం దోహదపడుతుంది. ఎక్కడి నుంచైనా సంబంధిత ఫైళ్లను క్లియర్ చేసే వీలు ఉంటుంది. ఫైళ్ల నిర్వహణ సులభతరం కావడంతోపాటు పారదర్శకత, విశ్వసనీయత, జవాబుదారీతనం కూడా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. జూలై రెండో వారం నుంచి రెవెన్యూ, విపత్తు నిర్వహణ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, స్టాంపులు- రిజిస్ట్రేషన్లు, దేవాదాయ ధర్మాదాయ తదితర శాఖల్లో కొత్త విధానాన్ని అమలు చేయాలనుకుంటోంది. క్రమంగా ఇతర శాఖలకు కూడా ఈ విధానాన్ని విస్తరింపచేయనుంది. ప్రస్తుతం పూర్తిస్థాయి సచివాలయం లేనందున మంత్రి ఒక చోట, ఆ శాఖ కార్యదర్శులు మరో చోట, దానికి సంబంధించిన విభాగాలు ఇంకోచోట.. ఇలా చెల్లాచెదురుగా ఉన్నాయి. పైళ్లను అటెండర్లు మోసుకెళ్లాల్సి వస్తోంది. ఫలింగా జాప్యం జరుగుతోంది. కొత్త విధానం అమల్లోకి వస్తే సమయం ఆదా కావడంతో పాటు రిస్కు తక్కువగా ఉంటుంది.

ప్రతీ కార్యాలయంలో స్కానర్, కంప్యూటర్..
‘ఈ-ఆఫీస్’ సాప్ట్‌వేర్ కోసం కొన్ని స్కానర్లు, ఎక్కువ స్పీడ్‌తో పనిచేసే కంప్యూటర్లు అవసరమని ఐటీ అధికారులు సూచించారు. వాటిని సమకూర్చే బాధ్యతను ప్రభుత్వం వారికే అప్పగించింది. దీంతో పాటే ఈ సాఫ్ట్‌వేర్‌ను వాడే ఉద్యోగుల మాస్టర్ డేటా బేస్, హైరార్కీ మ్యాపింగ్, వాళ్ల లాగిన్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ లాంటి వివరాలను సేకరించాల్సి ఉంటుంది. డిజిటల్ సంతకాల కోసం ప్రత్యేకంగా ‘ముద్ర అప్లికేషన్’ను వాడాలని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. జూలై ఆరో తేదీకల్లా ప్రతి శాఖలో ఒక నోడల్ అధికారిని నియమించి, ఏడో తేదీ లోగా డిజిటల్ సంతకాలను సేకరించి సిద్ధంగా ఉంచుకోవాలని సర్క్యులర్ జారీ అయింది. ఎనిమిదిన ఫైళ్ల డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని సర్క్యులర్ స్పష్టం చేసింది. తొమ్మిదిలోగా ‘ఈ-ఆఫీస్’ వాడే ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి’ఆన్‌లైన్’ పరిపాలన ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.



Next Story