దేశంలోనే అగ్రగామిగా ‘టీశాట్’​ నెట్​వర్క్​

by Shamantha N |   ( Updated:2020-08-07 08:41:08.0  )
దేశంలోనే అగ్రగామిగా ‘టీశాట్’​ నెట్​వర్క్​
X

దిశ, న్యూస్​బ్యూరో: టీశాట్​ నెట్​వర్క్​ ఛానళ్లను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అన్​లైన్ విద్యలో తెలంగాణ విద్యార్థులకు సంపూర్ణ సేవలు అందించడమే ప్రత్యేక లక్ష్యంగా ఎంచుకున్నామని ఆయన తెలిపారు. విద్యారంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు టీశాట్ నెట్​వర్క్​ ఛానళ్లను వినియోగించుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్​లోని టీశాట్ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బి.వినోద్ కుమార్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ శేషుకుమారి, టీఎస్​స్​హెచ్ఈసీ వైస్ ఛైర్మన్ వెంకటరమణతో కలిసి శుక్రవారం సందర్శించారు. ఆన్​లైన్ విద్యపై తెలంగాణ మంత్రివర్గం ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు వినోద్ కుమార్ టీశాట్​ సీఈఓ శైలేష్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అన్​లైన్ విద్య అందించడంలో టీశాట్ ఛానళ్లు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.

ఇప్పటి వరకు చేస్తున్న కృషికి తోడుగా మరిన్ని సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణలోని ప్రాథమిక, ఉన్నత విద్య, సాంకేతిక విద్యతో పాటు పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి అందించే ప్రసారాల విషయంలో మరిన్ని వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు.

ఇప్పటికే కేబుల్, ఆర్వోటీ, సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న టీశాట్​ను డీటీహెచ్​ల ద్వారా ప్రసారాలు అందించేందుకు ఐటీ శాఖ తరుపున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంపై తాను కూడా కేంద్ర ప్రసార శాఖ మంత్రితో మాట్లాడతానని హామీనిచ్చారు. టీశాట్ నెట్​వర్క్​ ఛానళ్లను దేశంలోనే మొదటి స్థానంలో నిలిచేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story