పేరుకే విచారణ.. ఇది ‘కార్పొరేటు’ సర్కార్

by  |
పేరుకే విచారణ.. ఇది ‘కార్పొరేటు’ సర్కార్
X

దిశ, న్యూస్ బ్యూరో:
కరోనా చికిత్స పేరుతో ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న కార్పొరేటు, ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోడానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. విచారణ పేరుతో కాలం గడుపుతోంది. ఇప్పటివరకు 90కు పైగా కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులపై వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చినట్లు స్వయంగా వైద్య మంత్రి ఈటల రాజేందర్ రెండు రోజుల క్రితం చెప్పారు. వాటిపై దర్యాప్తు జరపడానికి ప్రత్యేకంగా ఒక కమిటీని సైతం నియమిస్తున్నట్లు వెల్లడించారు. నెలన్నర రోజుల నుంచి ఫిర్యాదులు వస్తూనే ఉన్నా, రెండు ఆసుపత్రులపై నామమాత్రంగా చర్యలు తీసుకుని సరిపెట్టారు. కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు.

ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ వివరాల ప్రకారం నగరంలోని 91 ఆసుపత్రులు కరోనా చికిత్స అందిస్తున్నాయి. రెండు రోజుల క్రితం వరకూ వాటిపై 1039 ఫిర్యాదులు వచ్చాయి. అంటే సగటున ఒక్కో ఆసుపత్రిపై దాదాపు 11 ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై చర్యలు మాత్రం శూన్యం. ప్రభుత్వ అండదండలు పుష్కలంగా ఉన్న ఆసుపత్రులూ ఈ జాబితాలో ఉన్నాయి. కేవలం షోకాజ్ నోటీసులు ఇచ్చి ప్రభుత్వాధికారులు చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోకు విరుద్ధంగా అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నాఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. ఇకపైన తీసుకుంటారనే నమ్మకం కూడా లేదని ట్విట్టర్ ద్వారా ప్రభుత్వంపై విమర్శలు కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉన్నాయి.

కేటీఆర్ స్పందిస్తేనే చర్యలా?

ఒక ప్రైవేటు ఆసుపత్రి ఇష్టారాజ్యంగా అధిక చార్జీలను వసూలు చేస్తోందంటూ ట్విట్టర్ ద్వారా ఒక బాధితుడు మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే అది వైద్యారోగ్య శాఖ మంత్రికి వెళ్ళింది. గంటల వ్యవధిలోనే దవాఖానా అనుమతిని రద్దుచేస్తూ నిర్ణయం వెలువడింది. మరో ఆసుపత్రి విషయంలోనూ అదే జరిగింది. వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చిన ఆసుపత్రులపై మాత్రం ఇంకా ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఒక్కో రోజుకి సగటున లక్ష రూపాయల చొప్పున ఆసుపత్రులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన మాత్రం లేదు. ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న కొడుకును చూడడానికి ఆరు లక్షల రూపాయలు చెల్లించాలంటూ ఓ ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేసింది.

మరో మార్గం లేని తల్లి చివరకు నిరసన దాకా వెళ్ళడం మీడియా కంట పడింది. ఆ తర్వాత చావుబతుకుల్లో ఉన్న ఆ పేషెంట్‌ను ఆస్పత్రి నిర్వాహకులు ఆంబులెన్స్ ఎక్కించి మరీ ఇంటికి చేర్చారు. డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వకపోయినా ఫర్వాలేదని దిగివచ్చారు. ఈ సంఘటనపై ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యా లేదు. 12 రోజుల పాటు ఉన్న ఇన్‌పేషెంట్‌ నుంచి రోజుకు రూ.8000 చొప్పున పీపీఈ కిట్ల కోసం రూ. 96000 బిల్లు వేసింది ఓ ఆస్పత్రి. పీపీఈ కిట్లు అని నేరుగా కాకుండా ‘ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ కన్సూమబుల్స్’ అని పేర్కొంది. ఒక్కో పీపీఈ కిట్‌కు రూ.1,500 చొప్పున వసూలు చేసింది. రోజుకు సగటున రూ.28 వేల వంతున వసూలుచేసింది. హెల్త్ ఇన్సూరెన్సు కార్డు ఉన్నా చేర్చుకోడానికి ఆసుపత్రి సిద్ధపడలేదని, చివరకు డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని కేటీఆర్‌కు, ఈటల రాజేందర్‌కు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఆ ఆసుపత్రిమీద ప్రభుత్వానికి అంత ప్రేమ ఎందుకో అనే విమర్శలకు కూడా ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.

నియంత్రణ కోల్పోయిన ప్రభుత్వం..

ప్రైవేటు ఆసుపత్రులు ప్రజలను విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం ప్రేక్షకపాత్రే వహిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నా, ఆధారాలతో సహా మంత్రులకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నా, హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా బాధను చెప్పుకుంటున్నా ఫలితం లేకపోయింది. వెయ్యికి పైగా ఫిర్యాదులొచ్చాయని చెప్పుకుంటున్న ప్రభుత్వం వాటిమీద తీసుకున్న చర్యల విషయంలో మాత్రం రకరకాల కారణాలను చెప్తూ కాలం వెళ్ళదీస్తోంది. ఫిర్యాదులు వచ్చిన తర్వాత జరుగుతున్న దోపిడీని అరికట్టడానికి కూడా ఎలాంటి చర్యలు లేవు. ఎపిడమిక్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్… ఇవన్నీ కోరలు లేని చట్టాలుగానే ఉండిపోయాయా అనే విమర్శలకు సైతం ప్రభుత్వాధికారుల నుంచి సమాధానం లేదు.


Next Story

Most Viewed