ఎక్సైజ్‌ శాఖలో ఉద్యోగులకు మోక్షమెప్పుడో..!

by Anukaran |
ఎక్సైజ్‌ శాఖలో ఉద్యోగులకు మోక్షమెప్పుడో..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఆయా విభాగాల్లో పోస్టింగ్‎ల కథ తేలడం లేదు. డీపీసీ పూర్తి చేసి, పదోన్నతులు పొందినా పోస్టింగ్‎లు మాత్రం ముందుకు సాగడం లేదు. ఇటీవల ఎక్సైజ్ శాఖలో కేవలం 12 మందికి పోస్టింగ్‎లు ఇచ్చి రోజులు గడుస్తున్నా.. మిగిలిన దాదాపు 66 మందికి ఇంకా పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేయడం లేదు. ఒకే డీసీపీలో పదోన్నతులు పొందినా అందరికీ ఒకే ఉత్తర్వు ద్వారా పోస్టింగ్‎లు ఇవ్వాల్సి ఉండగా 12 మందికి ఈ నెల 3న ఆర్డర్లు ఇచ్చారు. మిగిలిన వారిని ఇంకా హోల్డ్‎లో పెట్టారు.

ఇటీవల ఈ 12 మందికి పోస్టింగ్​ఆర్డర్లు ఇచ్చినా పాత తేదీల్లోనే విడుదల చేసినట్లు ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుతం పాత పోస్టింగ్‌ల పరిస్థితి ఎలా ఉన్నా… కొత్తగా ఇవ్వాల్సిన పోస్టింగ్‌లు ఆలస్యమైతే సర్వీస్​రూల్స్‌లో ఇబ్బందులు వస్తాయని, పదోన్నతి పొందిన వారు సీనియర్లుగా ఉంటారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా 66 మందికి ఇవ్వాళ, రేపు ఆర్డర్లు అంటూ సాగదీస్తూనే ఉన్నారు. దీనిపై సదరు మంత్రికి విన్నవించినా ఫలితం లేదని ఆందోళన చెందుతున్నారు.

కోర్టుకెక్కుదామా..?

ఎక్సైజ్ శాఖలో పోస్టింగ్‌లపై కోర్టులో పిటిషన్​వేసేందుకు కొంతమంది అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒకవేళ వీటిపై కోర్టులో వ్యాజ్యం పడితే న్యాయపరమైన చిక్కులు చాలా వస్తాయంటున్నారు. ఒకే డీపీసీలో పదోన్నతులు పొందిన 12 మందికి ఈ నెల 3న… పాత తేదీల్లో అంటే గత నెల 22న పోస్టింగ్​ఆర్డర్లు జారీ చేశారు. వాస్తవంగా 38 మంది అసిస్టెంట్​ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 22 మంది సూపరింటెండెంట్లు, నలుగురు అసిస్టెంట్​కమిషనర్లకు, ముగ్గురు డిప్యూటీ కమిషనర్లకు, ఒక జాయింట్ కమిషనర్‌కు పదోన్నతి కల్పించారు. శాఖాపరంగా పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో పెరిగిన పోస్టుల ప్రకారం పదోన్నతులు కల్పించారు.

అయితే ఈ పోస్టింగ్‌లపై దాదాపు రెండు నెలల నుంచి దోబూచులాడుతున్నారు. వీరిలో 12 మందికి ఆయా స్థానాల్లో పోస్టింగ్‌లను గత నెల 6వ తేదీతో అడహాక్​ప్రాతిపదిక పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. వాటికి అనుగుణంగా 22న ఎక్సైజ్​ కమిషన్​పేరుతో పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఈ 12 మంది మినహా.. 66 మంది పోస్టింగ్ ఉత్తర్వులు కోసం ఇప్పుడా… అప్పుడా అంటూ ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి పదోన్నతి పొందినా కేవలం 12 మందికి మాత్రమే ఆర్డర్లు ఇచ్చారు. మిగిలిన వారికి ఇవ్వలేదు. దీంతో సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. ఒకవేళ అదే సమస్య వస్తే ఎవరైనా కోర్టెకెక్కితే మాత్రం ఆ శాఖ ఉన్నతాధికారులకు సమస్యలు వస్తాయని అబ్కారీ అధికారుల్లో చర్చ జరుగుతోంది.

ఇస్తారా.. ఇవ్వరా..?

అన్ని ప్రభుత్వ శాఖల్లో పోస్టింగ్‌ల వ్యవహారం ముగించాలని, పదోన్నతులు ఇచ్చి, ఆర్డర్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్​ గతంలోనే ఆదేశించారు. కానీ ఎక్సైజ్, కమర్షియల్​ట్యాక్స్, రెవెన్యూ వంటి శాఖల్లోనే ఈ వ్యవహారం సాగుతూ ఉంది. ఎక్సైజ్​శాఖలో ప్రస్తుతం పదోన్నతి పొందిన వారిలో 12 మందికి ఇచ్చి, 66 మంది ఆర్డర్లు ఆపేశారు. అటు కమర్షియల్ శాఖలో కూడా పదోన్నతులు వచ్చిన సంబురమే కానీ పోస్టింగ్‎​లు లేవు. ఈ శాఖలు కూడా రాష్ట్ర పాలనాధికారి చేతుల్లోనే ఉన్నాయి. దీనిపై అధికారులెవ్వరైనా కోర్టుకెక్కితే ఆయా శాఖల ఉన్నతాధికారిగా సీఎస్ కూడా కోర్టెకెక్కాల్సి ఉంటుందని అధికారులు చెప్పుతున్నారు. అయితే మంత్రులు కూడా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినా పోస్టింగ్‌ల ఫైల్​ మాత్రం ముందుకు కదలడం లేదు. పదోన్నతి పొందిన వారితో పాటు కిందిస్తాయిలో చాలా మందికి బదిలీలు చేయాల్సి ఉంది. ఉదాహరణగా ఎక్సైజ్​ శాఖలో ఈ 66 మంది తర్వాత ఇంకా ఏఈఎస్‌లు, సీఐలకు కూడా బదిలీలున్నాయి. ఇప్పుడు వారికి పోస్టింగ్‌లు ఇస్తారా… ఇవ్వరా అనే సందేహం నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed