- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరెంటు కొనేందుకు అప్పులు
అప్పుల కోసం రేటింగ్‌లు
ఇదే తెలంగాణ డిస్కంల
ఛార్జీల పెంపు యత్నాలకు రీజన్..
దిశ, న్యూస్ బ్యూరో : తెలంగాణ విద్యుత్ పంపిణీ(డిస్కం) సంస్థలకు అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడిందా.. అప్పు పుట్టని పరిస్థితి నుంచి బయటపడేందుకే విద్యుత్ ఛార్జీలు పెంచుకునేందుకు డిస్కంలు రెఢీ అవుతున్నాయా అంటే ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఇందులో వ్యవసాయానికైతే 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వ్యవసాయ రంగంతో పాటు ఎస్సీ, ఎస్టీలు వివిధ వర్గాలకు ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలు ఇస్తోంది. ఈ సబ్సిడీ డబ్బులను ప్రభుత్వమే ప్రతి ఏటా విద్యుత్ పంపిణీ సంస్థలకు వాయిదాల పద్ధతిలో విడుదల చేస్తోంది. వ్యవసాయానికి, ఇతర రంగాలకు కలిపి ఈ సబ్సిడీ సొమ్ముల మొత్తం తెలంగాణ ఏర్పడినపుడు రూ.5000 కోట్లుండగా.. తాజాగా ప్రవేశ పెట్టిన 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఇందుకోసం ప్రభుత్వం రూ.10 వేల 400 కోట్లు కేటాయించింది. ఈ సబ్సిడీ నిధులు కాకుండా సరఫరా చేసిన వాడుకున్న విద్యుత్‌కు డబ్బులు చెల్లించే కనెక్షన్‌లకు కూడా పూర్తి స్థాయి ఖర్చులను విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రభుత్వాదేశాలు లేక ఇన్ని సంవత్సరాలు వినియోగదారుల నుంచి రాబట్టలేక పోయాయి. దీంతో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లు భారీ నష్టాల్లో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ పక్క ప్రభుత్వం నుంచి వివిధ వర్గాలకిచ్చే సబ్సిడీ సొమ్ములు సమయానికందక, మరో పక్క వసూలవుతున్న కరెంటు ఛార్జీలు కరెంటు కొనడానికి, సంస్థల నిర్వహణకయ్యే ఖర్చులకు సరిపోక.. రెండు డిస్కంలు ప్రతి సంవత్సరం భారీ నష్టాలను మూట కట్టుకుంటున్నాయి.
దక్షిణ డిస్కం టీఎస్ఎస్పీడీసీఎల్‌లో ఈ నష్టాలు ఒక్క యూనిట్‌కు 49 పైసలుగా ఉండగా, టీఎస్ఎన్పీడీసీఎల్‌లో ఈ నష్టం ఒక్క యూనిట్‌కు 19 పైసలుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఒక్క ఈ ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్రంలోని రెండు డిస్కంలు కలిపి రూ.3500 కోట్ల నష్టాల పాలవనున్నట్లు అంచనా. రాష్ట్రం ఏర్పడినప్పటి (2014) నుంచి విద్యుత్ వినియోగం రెట్టింపై ప్రస్తుతం ఏడాదికి 70 వేల మిలియన్ యూనిట్లకు చేరుకుంది. దీనివల్ల ఈ స్థాయిలో కరెంటు కొనడానికి అవసరమయ్యే వర్కింగ్ క్యాపిటల్, ట్రాన్స్‌మిషన్ పెట్టుబడులకు, సంస్థల నిర్వహణకు డిస్కంలు ప్రతిఏటా అప్పులు చేసే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. అదే సమయంలో డిస్కంలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు చేయాల్సిన చెల్లింపులు కూడా భారీగా పేరుకుపోతున్నాయి. తెలంగాణలోని డిస్కంల బకాయిలు, అప్పులు కలిపి రూ.20 వేల కోట్ల పైమాటేనని ఒక అంచనా. అయితే కొత్త అప్పులు పుట్టాలంటే డిస్కంలకు ఫిస్కల్ రేటింగ్‌లు అవసరం. ఇప్పుడున్న నష్టాల్లో ఎంతో కొంత తగ్గితే తప్ప డిస్కంలకు ప్రస్తుతమున్న జంక్ రేటింగ్‌లు మెరుగుపడవు. దీంతో ఈ నష్టాలు తగ్గించుకోవడానికి ఛార్జీలు పెంచుకుని మరింత ఆదాయాన్ని సమకూర్చుకునే పరిస్థితి ఏర్పడుతోందని అధికార వర్గాలంటున్నాయి. ఇలా ఆదాయం ఎంతోకొంత పెరిగితే తప్ప తక్కువ వడ్డీ రేట్లకు కొత్త అప్పులు చేయలేని పరిస్థితి డిస్కంలది.
ఎల్‌సీలతో డిస్కంలకు గడ్డుకాలం..
కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక విద్యుత్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ఆకర్షించడానికి విద్యుత్ పంపిణీ రంగంలో పలు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. పవర్ ప్రొడ్యూసింగ్ కంపెనీల నుంచి విద్యుత్ కొనడానికి డిస్కంలు ఒప్పందాలు కుదుర్చుకునేటపుడే నిధులు సకాలంలో చెల్లింపు హామీ కింద బ్యాంకుల నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్‌సీ) సమర్పించాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఎంతో కొంత బాగుండి తగినంత క్యాష్ ఫ్లో రేటింగ్ ఉంటేనే బ్యాంకులు డిస్కంల తరపున లెటర్ ఆఫ్ క్రెడిట్‌లను అందజేస్తాయి. ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్‌లు లేకుండా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకొని వేలకువేల కోట్లు పెండింగ్‌లో పెట్టే పాత పరిస్థితి ఇప్పుడు డిస్కంలకు లేకుండా పోయింది. దీంతో విద్యుత్ కొనుగోలు, సరఫరాకు అయ్యే ఖర్చులు వినియోగదారుల నుంచి ఎప్పటికప్పుడు రికవర్ చేయాల్సిన పరిస్థితి వాటికి ఏర్పడుతోంది. ఈ నిబంధనల వల్ల డిస్కంలు ప్రభుత్వం వైపు చూస్తుంటే ప్రభుత్వం ఇప్పటికే సబ్సిడీల భారం మోస్తున్నందున విద్యుత్ ఛార్జీలను పెంచడానికి డిస్కంలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విద్యుత్ ఛార్జీల పెంపు విషయాన్ని సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
బేసిక్ ఛార్జీలు మాత్రమే పెంచే అవకాశం..
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి విద్యుత్ కనెక్షన్లు రాష్ట్రంలో 50 శాతం పెరిగాయి. రాష్ట్రం ఏర్పడిన 2014లో 1 కోటి వరకు ఉన్న విద్యుత్ కనెక్షన్లు ప్రస్తుతం 1 కోటి 50 లక్షలకు చేరాయి. వీటిలో డబ్బులు రాని వ్యవసాయ కనెక్షన్లు, సబ్సిడీ కింద ఉన్న 100 యూనిట్లలోపు వాడే విద్యుత్ కనెక్షన్లే ఎక్కువ. వీటికి ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచమని సీఎం కేసీఆర్ ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. నెలకు 101 యూనిట్ల నుంచి ఆపైన వాడే స్లాబులో ఉన్న గృహ, వ్యాపార కనెక్షన్లకు ఛార్జీలు 10 నుంచి 15 శాతం వరకు పెరగొచ్చని సమాచారం. కాగా, ఈ పెంపు కేవలం బేసిక్ ఇంధన ఛార్జీలోనే ఉంటుందని, ఎఫ్ఏసీ, ఫిక్స్‌డ్ ఛార్జీల్లోనే ఉండదని తెలుస్తోంది. ఈ ఛార్జీల పెంపుపై డిస్కంలు ఈ నెలాఖరుకు తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీకి) వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-21)నకు సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్) సమర్పించనున్నాయి. ఆ తర్వాత ఈఆర్సీ బహిరంగ విచారణ జరిపి ఛార్జీలను పెంచుకునేందుకు డిస్కంలకు అనుమతిస్తుంది.
ఎన్నికలన్నీ ముగిసినందునే సీఎం అనుమతి..
తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ముగిసినందునే ప్రభుత్వం డిస్కంలకు విద్యుత్ ఛార్జీలు పెంచుకునే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్టు భారీ లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోయాల్సి ఉండటం.. ఈ ప్రాజెక్టు బిల్లులతో పాటు నీటి లభ్యత పెరిగి వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరిగి అవన్నీ ప్రభుత్వమే సబ్సిడీల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. వీటికి తోడు డిస్కంలకు ఇంకా ఖజానా నుంచి డబ్బులు, బ్యాంకు గ్యారంటీలు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే డిస్కంలు తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకోవడానికి, 24 గంటల విద్యుత్ సరఫరా చేయడానికిగాను ఇన్ని సంవత్సరాలు అదనంగా నియమించిన సిబ్బందికి జీతాలు చెల్లించుకోవడానికి, అప్పులకు వడ్డీలు కట్టుకోవడానికి వినియోగదారులపైనే భారం మోపాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది.
Tags: ts power tariff increase, discoms, subsidies, debt, fiscal ratings, kcr