టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అధిష్టానం మొట్టికాయలు..

by Shyam |   ( Updated:2021-01-22 05:13:36.0  )
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అధిష్టానం మొట్టికాయలు..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయనకే చుట్టుకుంటున్నాయి. ఇటీవల ఆయన చేస్తున్న కామెంట్స్ ప్రతిపక్షాలకే ప్లస్ అవుతున్నాయి. దీంతో ఆయన్ను అధిష్టానం మందలించినట్లు విశ్వసనీయ సమాచారం.

రైతులపై నాడు..

అక్టోబర్ 16న మెట్‌పల్లిలో రైతులు ఆందోళన చేపట్టిన సందర్భంగా కొంతమంది ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్యే రైతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన వారు కానీ, తన ఇంటిపై దాడికి పాల్పడిన వారు అసలు రైతులే కాదని కామెంట్ చేశారు. పాంట్లు, షర్ట్స్ వేసుకున్నొళ్లు రైతులా..? దోతులు కట్టుకున్నోళ్లు రైతులు అవుతారు కదా అని కామెంట్ చేశారు. అంతేకాకుండా బీర్లు బిరియాన్లు తిని.ఆందోళన చేశారని, వారంతా కాంగ్రెస్ పార్టీ వాళ్లేనని ఆరోపించారు. దీంతో మళ్లీ రైతులు ఆందోళన చేశారు. విద్యాసాగర్ రావు తీరుపై మండిపడ్డారు. అది కాస్త తీవ్ర వివాదానికి తెరలేపడంతో చివరకు తాను అలా అనలేదని.. తన ఉద్దేశం అది కాదంటూ అందరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

నేడు రాముడు..

అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం విశ్వహిందూ పరిషత్ నిధి సేకరణ కార్యక్రమాన్ని గ్రామగ్రామాన చేపట్టింది. ఈ నేపథ్యంలో కోరుట్ల ఎమ్మెల్యే మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసి చర్చకు తెరతీశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి నిధులు ఇవ్వొద్దని, ఉత్తరప్రదేశ్‌లో ఉన్న రాముడు మనకెందుకంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఒక్క కామెంట్‌తో మళ్ళీ ఆయన వివాదాల్లో ఇరుక్కున్నారు. ఆయన చేసిన కామెంట్స్ పై బీజేపీ నాయకులు మండిపడుతుండటమే కాకుండా, ఆ అవకాశాలన్ని పార్టీకి ఫేవర్‌గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా, హిందూ సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో విద్యాసాగర్ రావు మళ్లీ వెనక్కి తగ్గి మాట మార్చారు. క్షమాపణలు చెప్తానని ప్రకటించారు.

అధిష్టానం సీరియస్..

కోరుట్ల ఎమ్మెల్యే తీరుపై టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ ముఖ్య నాయకులు ఈ విషయంపై చర్చించి కోరుట్ల ఎమ్మెల్యేను మందలించినట్టుగా గుసగుసలు వినపడుతున్నాయి. రాష్ట్రంలో పట్టు కోసం తీవ్రంగా బీజేపీ శ్రమిస్తున్న క్రమంలో ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నట్లు వెల్లడైంది. ఆయన వ్యాఖ్యలు బీజేపీకి లాభం చేకూర్చేలా ఉన్నాయని, దీంతో విద్యాసాగర్ రావుకు అనుకూలంగా వ్యవహరించే పరిస్థితి టీఆర్ఎస్‌లో లేకుండా పోయింది. దీంతో కోరుట్ల ఎమ్మెల్యే ఒంటరిగా మిగిలి పోవాల్సిన పరిస్థితి ఎదురైందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇంటలీజెన్స్ వర్గాల నుంచి కూడా సమగ్ర నివేదికలు తెప్పించుకున్న తర్వాత అధిష్టానం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. కోరుట్ల ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల్లో ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అత్యంత సన్నిహితునిగా ఉన్నప్పటికీ ఆయన కూడా విద్యాసాగర్ రావుకు అనుకూలంగా మాట్లాడేందుకు ససేమిరా అన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed