‘ఆపరేషన్ టీఆర్ఎస్’.. తెలంగాణలో బీజేపీ భారీ స్కెచ్..!

by Anukaran |   ( Updated:2021-03-09 03:37:59.0  )
‘ఆపరేషన్ టీఆర్ఎస్’.. తెలంగాణలో బీజేపీ భారీ స్కెచ్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో బలపడేందుకు కాషాయదళం కసరత్తు చేస్తోంది. రాబోయే ఎన్నికలలో విజయం సాధించే దిశగా ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. బీజేపీ కీలక నేత అమిత్ షా ఆధ్వర్యంలోనే ‘ఆపరేషన్ టీఆర్ఎస్’ ప్రారంభమైంది. అధికార పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు, ఓ మాజీ మంత్రి, ఒక జెడ్పీ చైర్‌పర్సన్ కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్. వీరికి పలు రకాల హామీలు లభించినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన గులాబీ బాస్ తాజా రాజకీయ పరిణామాలపై దృష్టి పెట్టారని సమాచారం.

కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకున్న ఫార్ములానే ఇప్పుడు బీజేపీ అవలంబిస్తోంది. ఇప్పటికే గులాబీ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలతో సంప్రదింపులు జరిపింది. మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌగ్‌తో పాటు కొందరు నేతలు ఇప్పటికే బీజేపీలో చేరారు. ఉద్యమం నుంచి జెండా మోస్తున్నా కనీస గుర్తింపు లేదని, మధ్యలో వచ్చినవారికి కీలక పదవులు ఇస్తున్నారంటూ కొద్దిమంది టీఆర్ఎస్ నేతలలో అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. అక్కడక్కడా ఎమ్మెల్యేలు బహిరంగ విమర్శలే చేశారు. తెలంగాణను కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించినవారికి కేబినెట్‌లో చోటుదక్కడంపై ఆవేదన కూడా ఉంది. సరిగ్గా ఈ అసంతృప్తినే బీజేపీ అవకాశంగా తీసుకుంటోంది. అందులో భాగంగా జరిపిన రాయబారంలో 11 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

ఆయా సెగ్మెంట్లలో టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా ఈ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలిసింది. అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. బీజేపీ కూడా వారికి గట్టి హామీలే ఇస్తున్నట్లు తెలిసింది. ఒకవైపు స్వంత పార్టీలో వర్గ విభేదాలు, మరోవైపు అసంతృప్తి, ఇంకోవైపు మంత్రులే వర్గాలను ఎంకరేజ్ చేస్తుండడం, అన్నింటికీ మించి బీజేపీ నుంచి గట్టి హామీలు ఈ పరిణామాలకు కారణమవుతున్నాయి. ప్రగతిభవన్‌లోకి ఎంట్రీ లేకపోవడం, అధినేత చెవిలో వేసే అవకాశం లేకపోవడం వీరికి అడ్డంకిగా మారింది.

పార్టీ మారుదాం

ఉద్యమాలకు కేంద్రబిందువుగా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గులాబీకి బైబై చెప్పడానికి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఇద్దరు, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ అగ్రనేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఒక్కో ఎమ్మెల్యే కూడా బీజేపీకి దగ్గరవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా త్వరలో పదవీకాలం ముగుస్తుండటం, అధినేత నుంచి పలకరింపులు లేకపోవడం, ప్రగతిభవన్‌కు దారి లేకపోవడంతో పార్టీని వీడాలనే నిర్ణయించుకున్నట్లు సమాచారం. గతంలో మంత్రిగా పనిచేసినా ఇప్పుడు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం, జిల్లాలోని ఇద్దరు మంత్రులూ తన ప్రత్యర్ధులకే అండగా ఉంటుండం, స్థానిక ఎమ్మెల్యేతో ఇటీవల విభేదాలు రచ్చకెక్కడం లాంటి కారణంతో సీనియర్ నేత ఒకరు పార్టీని వీడడమే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

ఇక్కడ కూడా

రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన హైదరాబాద్ పరిసరాలలోని ఓ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా పార్టీలో తగిన గౌరవం లేదని బాధపడుతూ బీజేపీతో టచ్‌లోకి వెళ్ళినట్లు తెలిసింది. మంత్రితో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకోడానికి అటు అధినేత, ఇటు యువనేత నుంచి సహకారం లేకపోవడంతో పార్టీని వీడేందుకే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటూ స్పష్టమైన హామీ ఇవ్వడంతో మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఓ మాజీ ఎంపీ కీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నింటినీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిశితంగా గమనిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed