రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం

by Shyam |
రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం
X

టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి రెండు స్థానాలను భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగా నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన కేశవరావు, సురేష్‌రెడ్డి మాత్రమే బరిలో ఉండడంతో ఆ ఇద్దరూ గెలుపొందినట్లుగా రిటర్నింగ్ అధికారి అయిన అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. ఈ నివేదికను అందుకున్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ వారి ఎన్నికను ధృవీకరిస్తూ ప్రకటన జారీ చేశారు. మూడో అభ్యర్థి పోటీలో లేకపోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది. పోలింగ్ జరగాల్సిన అవసరం లేకపోయింది.

ఏకగ్రీవంగా ఎన్నికైన ఈ ఇద్దరినీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అసెంబ్లీ ప్రాంగణంలో కలిసి అభినందించారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మరో మంత్రి సత్యవతి రాథోడ్ సైతం శాసన వ్యవహారాల్లో సీనియర్లుగా ఉన్న ఈ ఇద్దరూ రాజ్యసభలోకి వెళ్ళడం తెలంగాణ రాష్ట్ర అవసరాల రీత్యా చాలా మంచి పరిణామమని వ్యాఖ్యానించారు. తెలంగాణ స్వరాన్ని వినిపించడంలో ఈ ఇద్దరూ రాజకీయ పరిణతి కలిగినవారేనని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రగతిపై కేసీఆర్ పెట్టుకున్న ఆశయాలను సాధిస్తామని రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు పేర్కొన్నారు. తమను రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఆర్థిక పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, సీఎం ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రగతికి తమ వంతు కృషి చేస్తామన్నారు. అనంతరం సురేష్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణ నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ టీఆర్ఎస్ ప్రజలు గర్వపడేలా తన ప్రయత్నం ఉంటుందన్నారు. జీవితంలో ఇది తమకు పెద్ద ఛాలెంజ్ అని అన్నారు.

మరోవైపు నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా కింద జరగనున్న ఎన్నికలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ తరఫున అప్పటికే నర్సింగ్‌రావు నామినేషన్ దాఖలుచేశారు. బీజేపీ తరఫున లక్ష్మీనారాయణ కూడా నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం ముగ్గురు సభ్యులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేసిన నర్సింగ్‌రావు తన నామినేషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. బీజేపీ సభ్యుడు కూడా చివరివరకూ బరిలో ఉన్నట్లయితే ఎన్నికలు అనివార్యమవుతాయి. లేదంటే కవిత ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది.

Tags: Telangana, Rajya Sabha, Keshava Rao, Suresh Reddy, Unanimous elected, Assembly, CEO

Next Story

Most Viewed