బిగ్ బ్రేకింగ్: సాగర్‌లో టీఆర్ఎస్ ఘన విజయం

by Anukaran |   ( Updated:2021-05-02 03:47:09.0  )
Nomula Bhagat, cm kcr
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్‌లో గులాబీ జెండా రెపరెపలాడింది. హోరాహోరీగా సాగిన సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్ యాదవ్ గెలుపు బావుటా ఎగరేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుని టీఆర్ఎస్ చరిత్ర సృష్టించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన పాలేరు, నారాయణఖేడ్, హుజూర్ నగర్, దుబ్బాక ఉపఎన్నికల్లో సిట్టింగ్ పార్టీలు ఓటమిని మూటగట్టుకున్నాయి. నాగార్జునసాగర్‌లో మాత్రం అంచనాలను తలకిందులు చేస్తూ టీఆర్ఎస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డిపై 18వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో విజయ ఢంకా మోగించారు. వాస్తవానికి మొదటి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యం కనబర్చిన టీఆర్ఎస్.. ఒకట్రెండు రౌండ్లు మినహా ఏ రౌండ్‌లోనూ వెనక్కి తగ్గింది లేదు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మొత్తం 2.20 లక్షల ఓటర్లు ఉన్నారు.

కాగా ఇందులో 1.89 లక్షల ఓట్లు పోలయ్యాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని అర్జాలబావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. మధ్యాహ్నాం 2.30 గంటల సమయానికి దాదాపు 25 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇప్పటివరకు టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్ యాదవ్ 18449 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇదిలావుంటే.. 25వ రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి భగత్‌కు 2443 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 2408 ఓట్లు వచ్చాయి. దీంతో 25వ రౌండులో టీఆర్ఎస్ 35 ఓట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. ఇదిలావుంటే.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డికి గత ఎన్నికల సెంటిమెంట్ ఏమాత్రం పనిచేయలేదనే చెప్పాలి. కాంగ్రెస్ దిగ్గజాలు ఉత్తమ్, రేవంత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి సీనియర్లు అహర్నిశలు పోరాడినా కాంగ్రెస్ కురువృద్ధుడు జనారెడ్డికి ఓటమి తప్పలేదు. మరోవైపు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దుమ్మురేపిన బీజేపీ సైతం డీలాపడిపోయింది. కనీస పోటీ ఇవ్వకపోగా, డిపాజిట్ కోల్పోయి ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. ఉపఎన్నిక అభ్యర్థి విషయంలో బీజేపీ ఎంత సమన్వయం పాటించి.. అభ్యర్థిని ఎంపిక చేసినా.. క్యాస్ట్ ఈక్వేషన్ కమలనాథులకు ఏమాత్రం కలిసిరాలేదని చెప్పాలి.

Advertisement

Next Story