ప్రమాదకరంగా మ్యాన్‌హోల్.. ప్రజల ప్రాణాలు గాలికొదిలిన అధికారులు

by Shyam |   ( Updated:2021-11-18 01:28:35.0  )
ప్రమాదకరంగా మ్యాన్‌హోల్.. ప్రజల ప్రాణాలు గాలికొదిలిన అధికారులు
X

దిశ, మన్సూరాబాద్ : డివిజన్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో నడిరోడ్డుపై ప్రమాదకరంగా మ్యాన్ హోల్ పైకప్పు భూమి లోపలికి కూరుకుపోయి గుంత ఏర్పడింది. ఇటీవల పిల్లలు ఆడుకుంటూ అందులో పడిపోయి గాయపడ్డారు. పది నెలల నుంచి ప్రమాదకరంగా మ్యాన్‌హోల్ అలాగే ఉందని స్థానికులు చెబుతున్నారు.

వాహనదారులు, పాదచారులు నానా ఇక్కట్లు..

నిత్యం వందల మంది కాలనీవాసులు వాహనదారులు ప్రయాణించే మార్గం కావడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లలు స్కూల్‌కు వెళ్లే దారిలో ఇలా గుంత ఏర్పడటంతో వారు కూడా గాయపడుతున్నారు. కాలనీలోని మూలమలుపు వద్ద ప్రమాదకరంగా గుంత ఏర్పడి అందులోకి వరద నీరు చేరడం వల్ల వాహనదారులకు ఆ విషయం తెలియక అందులో పడిపోయి ఇబ్బందులకు గురవుతున్నారు.

అంతేకాకుండా ఈ కాలనీలో రోడ్డుపైనే చెత్తను పడేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆ చెత్తలో పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో దుర్గంధం వెదజల్లడంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కాలనీవాసులు సమస్యలపై పలు మార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ వారు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఇకనైనా మా సమస్యను ఆలకించి త్వరగా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement
Next Story

Most Viewed