వైద్య సామగ్రి తయారీకి సిద్ధమైన ట్రివిట్రాన్!

by Harish |   ( Updated:2020-04-04 07:13:14.0  )
వైద్య సామగ్రి తయారీకి సిద్ధమైన ట్రివిట్రాన్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలోనే అతిపెద్ద దేశీయ వైద్య పరికరాల తయారీ సంస్థ ట్రివిట్రాన్ హెల్త్‌కేర్… కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వస్తు సామాగ్రి, వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ), శానిటైజర్లను పెద్ద ఎత్తున తయారు చేయడానికి సిద్ధమైంది.

‘రానున్న కొన్ని వారాల్లో 10,000 వెంటిలేటర్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కాంపొనెంట్ సామాగ్రి, సమావేశాల కోసం ఆటోమొబైల్ తయారీదారులతో అవగాహనా ఒప్పందం కూడా చివరిదశలో ఉంది’ అని ట్రివిట్రాన్ ఛైర్మన్, ఎండీ జీఎస్‌కే వేలు తెలిపారు. ఇప్పటివరకూ రూ. 700 కోట్ల విలువైన ఇన్-విట్రో డయాగ్నస్టిక్స్, ఇంటెన్సివ్ కేర్, ఆపరేషన్ థియేటర్లు, వెంటిలేటర్లను మాత్రమే తయారు చేస్తున్నామని ఆయన వివరించారు.

చెన్నై, ముంబై, పూణె, అంకారా, హెల్సింకి ఐదు ప్రాంతాల్లో తొమ్మిది ఉత్పాదక సదుపాయాలను కలిగి వున్న ట్రివిట్రాన్, కోవిడ్-19 ఉత్పత్తులను ప్రధాన కేంద్రాలున్న చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ వద్ద తయారు చేయనుంది. ముంబైలోని ఆర్ అండ్ డీ కేంద్రం నుంచి అంతర్జాతీయంగా ఎక్కడైనా విక్రయించగలిగే కోవిడ్-19 సంబంధ వైద్య ఉత్పత్తులను అభివృద్ధి చేయనుంది.

ఇండియాలో కోవిడ్-19 టెస్టింగ్ కిట్ల భారీ ఉత్పత్తిని ప్రారంభించేందుకు కంపెనీ సన్నద్ధమవుతోందని ట్రివిట్రాన్ ఎండీ అన్నారు. పీపీఈల విషయంలో వస్త్ర రంగంలోని నిపుణులతో సంప్రదించి కంపెనీ ఉత్పత్తిని పెంచుతోంది. ముడి పదార్థాల కొరత సమస్యగా ఉందని, సరఫరాలో అవరోధాలను మరో వారంలోగా పరిష్కరిస్తామని ఆయన వివరించారు. ఇదే క్రమంలో, మాస్కులు మినహా కోవిడ్-19కి సంబంధించిన వైద్య సామాగ్రిని తయారుచేసే ఏకైక సంస్థ ట్రివిట్రాన్ మాత్రమే అని జీఎస్‌కే వేలు చెప్పారు.

Tags: Coronavirus, Coronavirus In India, COVID-19 Medical Supplies, Trivitron, Testing Kits, Ventilators, Personal Protective Equipment, Hand Sanitisers

Advertisement

Next Story

Most Viewed