మాకు నష్టం : గ‌వ‌ర్న‌ర్‌కు వెల్లువెత్తిన వినతులు

దిశ, న్యూస్ బ్యూరో: ‘‘ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలకు తెలంగాణ భూ హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం-2020 ద్వారా తీవ్ర నష్టం వాటిల్లుతుంది.. వారి భూ హక్కులకు భంగం కలుగడంతో పాటు గిరిజనేతరులు భూములు కొనే అవకాశం ఉందని, నిపుణులతో చర్చించి చట్టాన్ని మార్పులు చేసిన తర్వాతే ఆమోదముద్ర వేయాలి” అంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. తహసీల్దార్ కు రిజిస్ట్రేషన్ అధికారం ఇవ్వడంతో ఏజెన్సీ ప్రాంత భూములను ఎవరైనా కొనుగోలు చేసే వెసులుబాటు కలుగుతుందని, షెడ్యూల్డ్ ప్రాంతంలో భూ బదలాయింపు నియంత్రణ చట్టం-1970  ఉల్లంఘన జరిగిందని ఆదివాసీ నాయకులు లేఖలు రాశారు.

కొత్త ఆర్వోఆర్ చట్టం ఎల్టీఆర్ చట్టానికి సుపీరియర్గా మారే ప్రమాదం ఉందంటూ ఆదివాసీ నాయకులతో పాటు కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ కూడా తాజాగా రాసిన లేఖలో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇన్ని ఫిర్యాదులు, వినతుల నేపథ్యంలో గవర్నర్ తమిళిసై రెవెన్యూ చట్టాల నిపుణులు, ప్రొఫెసర్లు, రెవెన్యూ అధికారులతో చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, అసెంబ్లీ ఆమోదించిన కొత్త ఆర్వోఆర్ బిల్లు దస్ర్తాలు గవర్నర్ ఆమోదముద్ర కోసం ఇంకా రాజ్భవన్కు చేరలేదు.

ఆరోపణలపై నిపుణుల స్పష్టత..

గత ఆర్వోఆర్ చట్టంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ లు జారీ చేసే కె ఫారం, ఎల్ ఫారంలు తప్పనిసరిగా జత చేయడం, వాళ్లు క్లియరెన్స్ ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేయాలని ఉంది. ఇప్పుడూ అలాగే అమలు చేయడం ద్వారా ఇబ్బందులు ఉండకపోవచ్చని సూచించారు. ఆర్వోఆర్ అంటే హక్కులను రిజిస్ట్రర్ చేయడమేనని, సాదాబైనామాలను క్రమబద్ధీకరిస్తే ఎవరికైనా హక్కులు పొందే వీలు కలుగుతుందనే ఆరోపణ ఉన్నా, కే, ఎల్ ఫారాల నిబంధన పెడితే సరిపోతుందని నిపుణులు సూచించారు.

అప్పీలు అవకాశం లేకపోతేనే కష్టం..

భూ హక్కులు, పాసు పుస్తకాల చట్టం-2020 అమలు తర్వాత రెవెన్యూ కోర్టులేవీ ఉండవు. ప్రస్తుతం ఉన్న కేసుల పరిష్కారానికి మాత్రమే తాత్కాలిక ట్రిబ్యునళ్లు ఉంటాయి. ఏదైనా సమస్య తలెత్తితే సివిల్ కోర్టుకే వెళ్లాలని సీఎం ప్రకటించారు. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో సివిల్ కోర్టులు ఉండవు. ఈ క్రమంలోనే ఆర్వోఆర్ చట్టం వల్ల గిరిజన ప్రాంతాల్లో ఎవరికీ అన్యాయం జరుగదని, బేస్ రిజిస్టర్ లో అంతా క్లియర్ అనే ప్రభుత్వ ప్రకటనలో వాస్తవం లేదని భూ చట్టాల నిపుణుడు, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.సునీల్ కుమార్ చెప్పారు. ఎల్టీఆర్ తీర్పులు వచ్చినా అమలు చేయని కేసులు సుమారు 30 వేల వరకు ఉన్నాయని, నిజమైన హక్కుదార్ల పేర్లు ‘ధరణి’లో లేకపోతే తీరని అన్యాయానికి గురవుతారని పేర్కొన్నారు. ధరణిని ఎల్టీఆర్ కేసులతో పోల్చి చూడాల్సిన అవసరం ఉందన్నారు.

పున:పరిశీలన చేయాల్సిందే..

‘ధరణి’లో ఆర్ఓఎఫ్ఆర్ కు అనుగుణంగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ప్రతి ఐటీడీఏ పరిధిలో కనీసం ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తే ఆదివాసీలు న్యాయం పొందే వీలుంటుందని, గతంలో మాదిరిగా ఏటూరు నాగారం, ఉట్నూరు, భద్రాచలం కేంద్రాలు ఈ లీగల్ సెల్స్ నడిపిస్తే వారికి ఉచిత న్యాయ సలహాలు లభిస్తాయని సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు. ట్రైబల్ ఏరియాలో కాగితం కంటే పొషిషన్ కే ఆదివాసీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారనే తన అనుభవంలో  ఉట్నూరులో చూసిన ఘటనను గుర్తు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్వోఆర్ చట్టం ఫలాలు దక్కాలంటూ అప్పీళ్లకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సునీల్ సూచించారు.

Advertisement