మొక్కలు నాటండి.. గన్ లైసెన్స్ పొందండి

by  |
మొక్కలు నాటండి.. గన్ లైసెన్స్ పొందండి
X

దిశ, వెబ్‌డెస్క్ : పచ్చదనాన్ని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు మొక్కలు పెంచే కార్యక్రమాలెన్నో చేపడుతున్నాయి. మన రాష్ట్రంలోనూ హరితహారం పేరుతో కోటి మొక్కలకు పైగా నాటాలని ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఎంపీ జోగిన‌పల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భాగంగా సెలెబ్రిటీలందరూ మొక్కలు నాటడంలో భాగమవుతున్నారు. అయితే, పంజాబ్‌లోని పాటియాల యంత్రాంగం కూడా పచ్చదనం కోసం పరితపిస్తూ.. ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ‘ట్రీస్ ఫర్ గన్స్’.

‘ఇంటి ముందర చెట్టు ఉంటే ఇంట్లో డాక్టర్ ఉన్నట్లే’ అనే నానుడిని నిజం చేస్తూ.. ప్రతి రాష్ట్రం పచ్చదనాన్ని పెంపొందించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. పైగా తీవ్రంగా పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించుకోవడంతో పాటు వర్షాలు సకాలంలో కురవాలన్నా మొక్కలు అవసరమే. ఇప్పటి వరకు అభివృద్ధి పేరుతో కొన్ని లక్షల చెట్లను నరికేస్తూ వచ్చారు. ఆ ప్రభావం కారణంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి రావడంతో.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొన్నాయి. అందుకే మొక్కల పెంపకంపై దృష్టి పెట్టాయి. పాటియాల యంత్రాంగం కూడా ఇందుకోసం ‘ట్రీస్ ఫర్ గన్స్’ అనే ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. పది మొక్కలు నాటిన వారికే గన్ లైసెన్స్ ఇస్తామని ప్రకటించింది. అయితే ఇక్కడే ఓ మెలిక కూడా పెట్టింది.

ఏదో ప్రభుత్వం ఇంటింటికి మొక్కలు ఇస్తుంది కదా! అని మొక్కలు నాటేసి, ఓ సెల్ఫీకి పోజిచ్చేసి.. తర్వాత ఆ మొక్కకు మంగళం పాడటం పరిపాటే. మరి ఆ మొక్క బతుకుతుందా? లేదా? అనేది అనవసరం. దానికి రోజు కాసిన్ని నీళ్లు కూడా పోయరు. అందుకే పాటియాల అధికారులు మొక్కను నాటి వదిలేయకుండా ఆ నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నెలరోజుల పాటు నీళ్లు పోసి, వాటి ఎదుగుదలకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. నెలరోజుల సంరక్షణ తర్వాత, ఆ మొక్కలతో కలిసి ఫొటో దిగి తమకు చూపించాలనే కండిషన్ పెట్టింది. ఆ తర్వాతే తుపాకీ లైసెన్స్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుందని పాటియాలా అధికారులు తెలిపారు. ఇక తుపాకీ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలని అనుకునేవాళ్లు.. 5 మొక్కలు నాటాలని సూచించింది. ‘పాటియాలాలో పచ్చదనాన్నిపెంచేందుకు ఈ విధానం ప్రవేశపెట్టాం. పత్తి మొక్కలు తప్పించి ఏ మొక్కలైనా నాటొచ్చు. సొంత స్థలం ఉన్నవాళ్లు అక్కడే పెంచొచ్చు. లేనివాళ్లు పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడైనా పెంచొచ్చు. విద్యాలయాలు, గుళ్లు, ప్రార్థనా మందిరాలు, రోడ్డు పక్కన, ఇలా ఎక్కడైనా సరే మొక్కలు నాటొచ్చు’ అని డివిజనల్ కమిషనర్ చందర్ గైండ్ పేర్కొన్నారు.

పాటియాల గన్ లైసెన్స్ కోసం మొక్కలు నాటాల్సి వస్తే.. నైజీరియాలో ఏకే 47 ఇస్తే ఆవులు ఇస్తామని చెప్పడం గమనార్హం. నైజీరియాలోని ‘జంఫారా’ రాష్ట్రంలో.. బందిపోట్లను తిరిగి జనసామాన్యంలోకి తీసుకురావడానికి అక్కడి ప్రభుత్వం ‘కౌవ్స్ ఫర్ ఏకే-47’ అనే కొత్త పథకాన్ని ఇటీవలే తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బందిపోట్లు లొంగిపోయి.. ఒక ఏకే-47 రైఫిల్‌ అప్పగిస్తే, బదులుగా అధికారులు వారికి రెండు ఆవులు ఇస్తున్నారు.


Next Story

Most Viewed