RTIలో భిన్న వాయిస్‌లు..!

by  |
RTIలో భిన్న వాయిస్‌లు..!
X

దిశ, న్యూస్‌బ్యూరో : పారదర్శక పాలన అందించడానికి, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని బహిర్గతం చేయడానికి ఉనికిలోకి వచ్చిన సమాచార హక్కు చట్టాన్ని ఒక్కో ప్రభుత్వం విభాగం ఒక్కో రకంగా అర్థం చేసుకుంటోంది. ఒకే తరహా ప్రశ్నలకు లోక్‌సభ ఒకలాగ, రాజ్యసభ మరోలా స్పందించాయి. తెలంగాణలో NPDCL ఒక రకంగా స్పందిస్తే SPDCL మరో రకంగా స్పందించింది. దీనిని బట్టి సమాచారం ఇవ్వడానికి ఇష్టం లేకనే ప్రభుత్వ శాఖలు కుంటిసాకులు వెతుక్కుంటున్నాయని అర్థమవుతోంది. చట్టం ఒకటే అయినా దాన్ని అన్వయించుకోవడంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. సమాచార హక్కు చట్టాన్ని ఆమోదించింది పార్లమెంటే అయినా, దాన్ని సమర్ధవంతంగా అమలు చేయడంలో లోపం కనిపిస్తోంది. చట్టంలోని ప్రతీ అక్షరం పార్లమెంటు సెక్రెటేరియట్ అధికారులకు కొట్టిన పిండి. అమలు దగ్గరకు వచ్చేటప్పటికి తప్పించుకునే ధోరణి చూపుతున్నారు. తెలంగాణకు చెందిన జలగం సుధీర్ అనే యాక్టివిస్టు సమాచార హక్కు చట్టం ప్రకారం దాఖలు చేసిన దరఖాస్తుకు వచ్చిన సమాధానాలే అందుకు నిదర్శనం.

ఎందుకిలా..?

ఎందరు ఎంపీలకు, ఎంత మంది సచివాలయ సిబ్బందికి కరోనా సోకింది? వారి చికిత్సకు చేసిన ఖర్చు ఎంత? వైరస్ వ్యాప్తి నివారణకు చేసిన ఖర్చెంత? వివరాలు కావాలని సుధీర్ లోక్‌సభ , రాజ్యసభ అధికారులకు వేర్వేరుగా అర్జీలు సమర్పించారు. రాజ్యసభ నుంచి కోరిన సమాచారాన్ని పంపించినప్పటికీ, లోక్‌సభ సచివాలయ అధికారులు మాత్రం ఇది సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదని, ఎంపీల, సిబ్బంది వ్యక్తిగత వివరాలతో ప్రజా ప్రయోజనాలేవీ లేవని, అందువల్ల సమాధానం ఇవ్వాలని భావించడం లేదని బదులిచ్చారు. రాజ్యసభ సచివాలయం మాత్రం 19 మంది సిబ్బందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని, ఎంపీల్లో ఎవ్వరికీ ఇన్‌ఫెక్షన్ వచ్చినట్లు కార్యాలయానికి సమాచారం అందలేదని జవాబిచ్చారు. సిబ్బంది చికిత్సకు సచివాలయానికి కేటా యించిన బడ్జెట్‌లోంచి ఎలాంటి ఖర్చు చేయలేదని, ఆవరణ మొత్తం రసాయనాల పిచికారీ చేయడానికి మాత్రం రూ. 15.76 లక్షలు మంజూరు చేశారని తెలిపారు.

తెలంగాణలోనూ!

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల కాలంలో ఎందరు చనిపోయారు? వారికి చట్టం ప్రకారం చెల్లించిన పరిహారం ఎంత? జిల్లాలవారీగా విద్యుత్ షాక్, లేదా ట్రాన్స్‌ఫార్మర్ల పేలుడుతో జరిగిన ప్రాణనష్టం ఎంత? తదితర వివరాలు కావాలని సుధీర్ ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ కు వేర్వేరుగా దరఖాస్తులు ఇచ్చారు. ఉత్తర డిస్కం సానుకూలంగా స్పందించి, ఇప్పటివరకు 3,008 మంది చనిపోయారని, వారికి 33.88 కోట్ల మేరకు పరిహారం చెల్లించామని జవాబిచ్చింది. జిల్లాలవారీగా ఎందరు, ఎంతమందికి పరిహారం ఇచ్చిందీ వివరాలను అందజేసింది. దక్షిణ డిస్కం మాత్రం ఈ సమాచారంతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని కొట్టి పడేసింది. పరిమిత స్టాఫ్‌తో జిల్లాలవారీగా ఐదు సంవత్సరాల జాబితాను సిద్ధం చేయడం సాధ్యం కాదని, ఇందుకోసమే సిబ్బందిని కేటాయించడం కుదరదని తేల్చి చెప్పింది. ఏ అవసరం కోసం ఈ సమాచారాన్ని దరఖాస్తుదారు కోరుతున్నారో చెప్పలేదని, సమాధానాలు ఇవ్వాలంటే చాలా సమయం పడుతుందని, సిబ్బం ది శక్తినంతా వెచ్చించి తయారుచేసినా ఎవ్వరికీ పెద్దగా పనికిరాదంటూ వక్ర భాష్యాలు చెప్పింది.

ఇదీ వారి చిత్తశుద్ధి..

సమాచార హక్కు చట్టం ఒకటే అయినా ఒకే రకమైన ప్రశ్నలకు ప్రభుత్వ శాఖలు వేర్వేరు సమాధానాలు ఇచ్చాయి. దీంతో ఆయా సంస్థలకు ఈ చట్టం పట్ల ఉన్న చిత్తశుద్ధి, గౌరవం ఏ పాటిదో అర్థమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం పారదర్శక పాలన గురించి పదేపదే చెబుతుంది. దరఖాస్తుదారు అడిగిన సమాచారం గురించి లిఖితపూర్వకంగా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.



Next Story