ఇకపై నచ్చిన చానల్‌ సెలెక్ట్ చేసుకోండి

దిశ, వెబ్‌డెస్క్: మనం సాధారణంగా డిష్ టీవీ కనెక్షన్ తీసుకుంటే.. ఏదో ఓ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. కానీ అందులోని చానల్స్ అన్నీ చూడం. ఆ ప్యాక్‌లో నాలుగు చానల్స్ ఉంటే, నచ్చిన రెండు చానల్స్ కోసం.. మిగతా రెండింటికీ బిల్ కట్టాల్సి వస్తుంది. ఇకపై మీకు ఆ అవసరం ఉండదు. ఎందుకంటే డీటీహెచ్‌ల అధిక వసూళ్ల నుంచి కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేలా భారత టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఇటీవలే ‘చానల్‌ సెలెక్టర్‌’ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌ వినియోగంతో కస్టమర్లు తమకు నచ్చిన చానళ్లను ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. అవసరం లేని చానళ్లను యాప్ ద్వారా తొలగించుకోవచ్చు.

కావాల్సిన చానళ్లకు మాత్రమే డబ్బులు చెల్లించే సదుపాయం ‘చానల్ సెలెక్టర్ ’ యాప్‌తో ఇక సులభం కానుంది. దీంతో కస్టమర్లకు నెలవారీ బిల్లుల భారం తగ్గే అవకాశం ఉంటుందని ట్రాయ్‌ చెబుతోంది. గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ ఐ స్టోర్‌లోనూ ఈ అప్లికేషన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌లో టాటా స్కై, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ, హాత్ వే డిజిటల్, సిటీ నెట్‌వర్క్, ఏషియన్ నెట్ వంటి డీటీహెచ్ ఆపరేటర్లందరినీ ట్రాయ్ చేర్చింది.

ఇలా వాడాలి..

– మొబైల్‌లో చానల్ సెలెక్టర్ యాప్ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
– డీటీహెచ్ ఆపరేటర్‌ను ఎంచుకోవాలి.
– సెట్‌టాప్‌ బాక్స్‌ నెంబర్‌, సబ్‌స్ర్కైబర్‌ ఐడీ వివరాలతోపాటు మీ ఆపరేటర్‌ దగ్గర రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి.
– ఆ తర్వాత మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేయగానే సబ్‌స్క్రిప్షన్‌ వివరాలు కనిపిస్తాయి.
– చానళ్ల వివరాలు, వాటి ధర కూడా యాప్‌లో కనిపిస్తాయి. వాటిలో అవసరమైన వాటిని ఎంచుకోవచ్చు. అనవసరం అనుకుంటే తొలగించుకోవచ్చు.
– ఎంచుకున్న చానళ్ల ప్రకారం.. బిల్ చూపిస్తుంది. కడితే సరిపోతుంది.. సింపుల్!

Advertisement