మా నాన్నకు కరోనా లేదు.. ప్లీజ్ సహాయం చేయండి..

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి మనుషులనే కాదు… మానవ సంబంధాల్ని కూడా మింగేస్తోంది. కరోనా రోగం కంటే రోగులపట్ల చూపిస్తున్న వివక్ష కూడా కొందరు ప్రాణాలు కోల్పోవడానికి కారణం అవుతోంది. ఒక్క కరోనానే కాదు మరే వ్యాధి సోకినా బయటకి చెప్పాలన్నా, డాక్టర్ దగ్గరకి వెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ కరోనా అనుకుని చుట్టుపక్కలవాళ్ళు వెలేస్తారేమో అనే భయం.

చిత్తూరు జిల్లాలో కరోనా అనుకుని వృద్ధుడికి సహాయం చేయడానికి ఎవరూ లేక ప్రాణాలు కోల్పోయిన ఘటన… మానవత్వం మంటగలిసింది అనడానికి ఉదాహరణగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే… చిత్తూరు జిల్లా, గంగవరం మండలం, కలగటూరు గ్రామానికి చెందిన 77 ఏళ్ళ వెంకట్రామయ్య శనివారం రాత్రి ఇంటి ముందు నిద్రిస్తుండగా… ఆయనపై ఆవు దాడి చేసింది. అతని గుండెలపై కాలుపెట్టి తొక్కడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.

దీంతో ఆయన కూతురు తన తండ్రికి వైద్యం చేయించాలని ఆవు యజమానిని అడిగింది. కానీ అతను పట్టించుకోకపోవడంతో తానే తండ్రికి ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స చేయించింది. ఇంటికి వచ్చిన తర్వాత వెంకట్రావుకి ఊపిరి తీసుకోవడం ఇబ్బంది కావడంతో ఆటోలో మళ్లీ ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. దీంతో ఆటో వ్యక్తి అక్కడే మృతదేహాన్ని దించేసి వెళ్లిపోయాడు.

వెంకట్రావు రోదిస్తూ సహాయం కోసం అభ్యర్ధించగా… కరోనాతో చనిపోయాడని అనుమానించిన స్థానికులు ఎవరూ ముందుకు రాలేదు. మా నాన్న కరోనాతో చనిపోలేదంటూ వాపోయినా ఎవరూ పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని కలగటూరుకు తరలించారు.

Advertisement