- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్థల పరిశీలన చేయకుండానే పర్మిషన్స్
దిశ, శేరిలింగంపల్లి: సామాన్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, చివరకు అత్యున్నత న్యాయస్థానం చివాట్లు పెట్టినా గ్రేటర్ మున్సిపల్ అధికారుల తీరు మారట్లేదు. నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు అన్న చందంగా అక్రమార్కులకు వంతపాడుతూ.. పనిచేస్తున్న డిపార్ట్ మెంట్ కు చెడ్డ పేరు తెస్తున్నారు. అంతేగాక జీహెచ్ఎంసీ ఆదాయానికి గండి కొడుతున్నారు. మధ్య దళారులు, కొందరు అధికారులు కుమ్మక్కై అందినకాడికి దండుకుంటున్నారు. బ్లాక్ మెయిలర్లను ప్రోత్సహిస్తున్న ఆఫీసర్లను వదిలే ప్రసక్తే లేదని ఓ వైపు ఎమ్మెల్యే వార్నింగ్ లు ఇస్తున్నా.. ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డ కొందరు అధికారులు మాత్రం అదే బ్లాక్ మెయిలర్లతో అంటకాగుతూ అడ్డగోలుగా నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఈ వ్యవహారం మరీ శృతిమించడంతోనే ఎమ్మెల్యే పలుమార్లు బహిరంగ ప్రకటన చేయాల్సి వచ్చిందని, అయినా అధికారుల తీరు మారకపోవడం వారి అవినీతి పరాకాష్టకు నిదర్శనమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎమ్మెల్యే చెబితే వినాలా..?
కూకట్ పల్లి, శేరిలింగంపల్లి సర్కిళ్లలోని కొందరు జీహెచ్ఎంసీ అధికారుల తీరుపట్ల ఈ మధ్యకాలంలో ఉన్నతాధికారులకు తరుచూ ఫిర్యాదులు అందుతున్నాయి. అక్కడ కూడా ఆ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కొందరు నిర్మాణదారులు, బిల్డర్లు ఏకంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీరియస్ గా స్పందించిన ఎమ్మెల్యే అధికారులు తీరు మార్చుకోవాలని, బ్లాక్ మెయిలర్లను ప్రోత్సహించడం మానుకోవాలంటూ హెచ్చరించారు. అయినా వారి తీరు మారలేదు సరికదా.. ఎమ్మెల్యే మాటలను బేఖాతర్ చేస్తూ యధావిధిగా తమపని తాము చేస్తూ పోతున్నారు. దీంతో ఎమ్మెల్యే మరోసారి కూడా ఇదే తరహా వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే చెబితే వినాలా..? ఎవరైతే మాకేంటి. వీ డోంట్ కేర్ అంటూ పాత పద్ధతిలోనే తమ పని కనిచ్చేస్తున్నారు అవినీతి అధికారులు. ఈ వ్యవహారం అంతటిలో కొందరు కీరోల్ పోషిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా కూకట్ పల్లి సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న ఆ ఇద్దరు మహిళా అధికారులు నియంతల్లా వ్యవహరిస్తున్నారని, కొందరు ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని బిల్డింగ్ పర్మిషన్స్ కు ఇంతా అని వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందులో టీపీఎస్ లో పనిచేసే అధికారిణికి ఓ వ్యక్తి చేత ముడుపులు తీసుకుంటారని, లేదంటే ముప్పతిప్పలు పెడతారని తోటి సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు.
చూడకుండానే పర్మిషన్స్..
అన్ని అనుమతులు ఉండి ఎవరైనా భవన నిర్మాణం అనుమతులు కావాలంటూ జీహెచ్ఎంసీ అధికారుల దగ్గరకు వెళ్లిన నాటి నుంచి ఇంటి నెంబర్ కేటాయించే వరకు వారిని వేపుకు తింటున్నారని, తిలా పాపం తలా పిడికెడు అన్నచందంగా ప్రతీచోట ముడుపులు ముట్టచెప్పాల్సిందే అని బాధితులు వాపోతున్నారు. హైదర్ నగర్ లో ఇటీవల ఓ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. పర్మిషన్స్ కోసం అప్లై చేసిన డాక్యుమెంట్ లో సర్వే నెంబర్ 67, 68 అని పేర్కొని అనుమతులు తీసుకున్నారు. కానీ ఆ బిల్డింగ్ కట్టింది మాత్రం సర్వే నెంబర్ 172లోని సెట్విన్ స్థలంలో గూగుల్ మ్యాప్ లో ఇదే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ పర్మిషన్స్ ఇచ్చిన టీపీఎస్ అధికారులు మాత్రం కనీసం ఈ విషయాలేవీ పట్టించుకోకుండా ఆక్యుపెనీ సర్టిఫికెట్ జారీ చేశారు. అలాగే పీటీఐ నెంబర్లు కేటాయించడంతోపాటు ఇంటి నెంబర్లు సైతం వేసేశారు. ఈస్థలం విషయంలో ఓవైపు కోర్టులో కేసులు, మరోవైపు బాధితులు ఆందోళనలు చేస్తున్నా.. ఈ విషయాలేవీ పట్టించుకోకుండానే జీహెచ్ఎంసీ అధికారులు ఇదంతా చేశారా..? లేదా మమ్మల్ని ఎవరు అడుగుతారు లే అనే ధీమానా అనేది వారికే తెలియాలి. అదీగాక ఇదే విషయంపై టీపీఎస్ అధికారిణి దీపను అడిగితే అప్పుడు మీరు ఎక్కడకు వెళ్లారు. ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు. మేమే ఇచ్చాం ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని దురుసుగా సమాధానం చెబుతున్నారు. పైగా నేనే చేశాను అని చెబుతున్న అధికారిణి కనీసం ఎమ్మెల్యే మాట కూడా వినరని టాక్. సెట్విన్ స్థలంలో నిర్మించిన కట్టడంపై ఈగ వాలకుండా చూసే బాధ్యత నాదంటూ హామీ ఇచ్చేశారట. అందుకు ఆమెకు పై అధికారులు సైతం వత్తాసు పలుకుతున్నారని సమాచారం.