కేసీఆర్ దళిత బంధు కాదు… దళిత రాబంధు : మల్లు

by Shyam |   ( Updated:2021-07-20 22:51:07.0  )
Mallu Ravi
X

దిశ, తెలంగాణ బ్యూరో : దళిత ముఖ్యమంత్రి అని… ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి అని హామీలు ఇచ్చి.. మాయ మాటలు చెప్పి కేసీఆర్ దళితులందరిని మోసం చేశారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ధ్వజమెత్తారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ తీరు నేతి బీరకాయ చందంగా ఉందని మండిపడ్డారు. ఏడున్నరేళ్ల తర్వాత దళిత బంధు గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. అది దళిత బంధు కాదని, దళిత రాబంధు అని ఆరోపించారు.

దళిత బంధు అనగానే క్షీరాభిషేకాలు చేయడం సిగ్గుచేటన్నారు. దళితులకు ఏదైన స్కీం ప్రవేశపెడితే దానికి దళిత బంధు అని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని, కేసీఆర్ ప్రభుత్వం మొదట హామీని విస్మరించిన విషయం అందరికీ తెలుసు అన్నారు. దళిత సబ్ ప్లాన్ డబ్బులు పక్కదారి పట్టించి దళిత బంధు గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. లక్షా 25 వేల కోట్ల ఖర్చు పెడుతున్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి, రూ.65కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని… మీరు దళిత బంధు కాదని దళిత వ్యతిరేకి అని మండిపడ్డారు. ప్రభుత్వం చెప్పే మాయమాటలను రాష్ట్రంలోని దళితులు చీదరించుకుంటున్నారన్నారు. ముమ్మాటికి దళిత మోసకారి సీఎం కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళిత నాయకుడు రాజయ్యను మంత్రి పదవి నుంచి తొలగించింది ఎందుకో ఇప్పటికి ఎవరికి అర్థం కావడం లేదని, ప్రభుత్వమే ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ప్రతి దళితుడికి 3 ఎకరాలు భూమి ఇస్తామని ఇచ్చిన మాట ఏమైందని కేసీఆర్ ను ప్రశ్నించారు. సరైన సమయంలో ఉద్యోగాలను భర్తీ చేస్తే దళితులకు 32వేల ఉద్యోగాలు వచ్చేవని, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్య, వైద్య రంగంలో ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు.

టీఆర్ఎస్ మాయమాటలకు కాలం చెల్లిందని, కేసీఆర్, కేటీఆర్ పై వ్యక్తిగతంగా కోపం లేదని, వారు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతోనే నిలదీస్తున్నట్లు వెల్లడించారు. ఇంటికి రూ.10లక్షలు కేవలం హుజూరాబాద్ లోనే కాదని రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తూ దళితులకు అన్యాయం చేస్తుందని దుయ్యబట్టారు. దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆరోపించారు.

రూ.65 కోట్లతో భూమి కొనుగోలు చేసి దళితులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. భూమి ఎక్కడుందో తెలియకపోతే డబ్బులు విడుదల చేస్తే కాంగ్రెస్ పార్టీ భూమిని కొని దళితులకు పంచుతామని స్పష్టం చేశారు. కేవలం హుజురాబాద్ ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అనేది కేవలం ఉప ఎన్నికలు దృష్టిలో ఉంచుకొనే అనేది అందరికి తెలుసు అన్నారు. మోసపూరిత హామీలు కాకుండా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed