పేదలకు సన్నబియ్యం అందించాలి : టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్

by Shyam |
పేదలకు సన్నబియ్యం అందించాలి : టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్
X

దిశ, నల్లగొండ: కరోనా నేపథ్యంలో తిండి లేక ఇబ్బందులు పడుతున్న రాష్ట్రంలోని నిరుపేదలకు ప్రభుత్వం సన్న బియ్యం అందించాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఎంపీ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యం నూటికి 80 శాతం మంది తినడం లేదన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తినడానికి అనువుగా ఉండే బియ్యం అందించాలని కోరారు. అయితే రాష్ట్రం అందించే రేషన్‌లో కేంద్రం ప్రకటించిన బియ్యం వాటా ఎంతుందో ప్రకటించాలని ఎన్నిమార్లు అడిగినా సీఎం నుంచి సమాధానం లేదన్నారు. ఉజ్వల గ్యాస్ మాదిరిగానే, రాష్ట్రంలోని కోటి మంది దీపం పథక లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ అందజేయాలన్నారు. రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యపై పలు అనుమానాలు ఉన్నాయని, కాబట్టి ఇప్పటి వరకు ఎన్ని కేసులు పాజిటివ్ వచ్చాయో ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాలని ఉత్తమ్ కోరారు. తెలంగాణలో కరోనా నిర్దారణ పరీక్షలు సరిగా జరపడం లేదని ఆరోపించారు. తక్కువ సంఖ్యలో టెస్ట్‌లు చేస్తే వ్యాధి తీవ్రత ఎలా తెలుస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రశ్నించారు.

Tags: corona, tpcc uttam kumar, quality rice distribution, demanding, lockdown

Advertisement

Next Story

Most Viewed