కొత్తవి లేవు.. ఉన్న ఉద్యోగాలకు ఎసరు

by Shyam |
కొత్తవి లేవు.. ఉన్న ఉద్యోగాలకు ఎసరు
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరాక కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు కానీ, ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెట్టేలా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఆ మాటను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. లక్ష పైచిలుకు ఉద్యోగాలు ఇప్పిస్తానన్న స్థానంలో 40 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయారన్నారు.

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చిన సీఎం దానిని నెరవేర్చకపోగా వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తుండటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పోయినేడాది తమ హక్కుల కోసం, ఉద్యోగ భద్రత కోసం ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని భయభ్రాంతులకు గురిచేసి వారిని లోబరుచుకున్నారన్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఎంతో కష్టపడి పనిచేసిన 11వేల మంది ఉద్యోగులకు పన్నెండు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఇప్పుడు వారిని ఇంటి బాట పట్టించడం మీ అహంకార ధోరణికి నిదర్శనమని అన్నారు.

ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో పనిచేసే 7,714 ఫీల్డ్ అసిస్టెంట్లను 479 అనే సర్క్యులర్ ను అడ్డం పెట్టుకుని నిర్దాక్షిణ్యంగా పనుల నుంచి తొలగించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. వీరిని మాత్రమే కాకుండా ఎస్సీ, ఎస్టీ మైనారిటీ గురుకులాల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులందరినీ నిర్ధాక్షిణ్యంగా తొలగించడం జరిగిందన్నారు. రూ.46 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 16వేల మంది విద్యావాలంటీర్లను తీసుకున్న మీరు గత డిసెంబరు నుంచి ఇప్పటి వరకు వారికి వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. కార్యక్రమంలో ప్రచార కార్యదర్శి సిజే బెనహర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story