రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోంది

by  |
రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోంది
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో నిర్బంధ పాలన, పోలీసు రాజ్యం నడుస్తోందని, నిరసన తెలియజేయడానికి కూడా అవకాశం ఉండట్లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పాలన సాగిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రోడ్డెక్కే పరిస్థితి లేకుండాపోయిందని, ఎక్కడికక్కడ అరెస్టులు, గృహనిర్బంధాలు సాధారణమైపోయాయని అన్నారు. ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ ఎన్ఎస్‌యూఐ విద్యార్థులు ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునిస్తే పదుల సంఖ్యలో అరెస్టు చేయడాన్ని ఉత్తమ్ ఖండించారు. విద్యార్థిసంఘం అధ్యక్షుడు వెంకట్‌తో పాటు పలువురిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు.

ప్రజా సమస్యలపై నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరునికి ఉందని, విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. ప్రవేశ పరీక్షల విషయంలో ఒకవైపు కోర్టులో కేసు విచారణలో ఉండగానే ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు పూనుకోవడం ప్రజా వ్యతిరేక చర్య అని వ్యాఖ్యానించారు. విద్యార్థుల జీవితాల పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఇదేనా అని ప్రశ్నించారు. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే ప్రవేశ పరీక్షలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed