మాటల్లో తుగ్లక్‌ను మించిన కేసీఆర్ : ఉత్తమ్

by Sridhar Babu |
మాటల్లో తుగ్లక్‌ను మించిన కేసీఆర్ : ఉత్తమ్
X

దిశ, కరీంనగర్:
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నవిధానాల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మాటలు చెప్పడంలో కేసీఆర్ తుగ్లక్‌ను మించిపోయారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.గురువారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఐసీఎంఆర్ చెప్పిన దానికి పూర్తి భిన్నంగా రాష్ట్రంలో కరోనా టెస్టులు జరుగుతున్నాయన్నారు. పక్క రాష్ట్రాలు 2లక్షల టెస్టులు చేస్తే తెలంగాణలో ఇప్పటి వరకు కేవలం 22 వేల టెస్టులే చేశారని విమర్శించారు.టెస్టుల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా పని చేయడం లేదని, ప్రయివేటు దవాఖానాల్లోనూ టెస్టులు చేయాలని హైకోర్టు చెప్పేవరకు రాష్ట్రం పట్టించు కోలేదని మండిపడ్డారు.సీఎం తప్పుడు ధోరణి వల్లనే తక్కువ కేసులు నమోదయ్యాయని, రాష్ట్రంలో రోజుకు 5 వేల టెస్టులు చేయాల్సి ఉంటే కేవలం 200 మాత్రమే చేస్తున్నారన్నారు. వలస కూలీలు ఎంత మంది ఉన్నారో కూడా ప్రభుత్వం చెప్పలేకపోతుందంటే ఎంతటి దయనీయ పరిస్థితి తయారైందో అర్థం చేసుకోవచ్చని ఉత్తమ్ తెలిపారు. గణాంకాలే తెలియని ప్రభుత్వం వారికి ఎలా తిండి పెడుతుందని ప్రశ్నించారు.నేటికి కేంద్రం నుంచి, వివిధ వర్గాల ద్వారా వచ్చిన విరాళాల వివరాలు తెలియపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అలాగే కరోనా నియంత్రణకు ఎంత ఖర్చు చేశారో ప్రకటించాలన్నారు. ఆరేళ్లుగా అడ్డగోలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని, కరోనా వల్ల రాష్ట్రం అప్పుల పాలు కాలేదని వివరించారు. ప్రజలను, బాండ్లను తాకట్టు పెట్టి రూ.4 వేల కోట్లు అప్పు తెచ్చారని, మహ్మద్ బిన్ తుగ్లక్ కంటే కేసీఆర్ ఎక్కవ మాటలు చెబుతున్నారని టీపీసీసీ చీఫ్ విమర్శించారు. 3 నెలలు గడిచినా కంది రైతులకు నేటికి డబ్బులు ఇవ్వలేని ప్రభుత్వం, మళ్ళీ కందులు వేయమంటోందని ఎద్దేవ చేశారు.

Advertisement

Next Story

Most Viewed