యాక్టర్స్.. పార్టీస్!

by HARISH SP |   ( Updated:2024-10-06 12:42:18.0  )
యాక్టర్స్.. పార్టీస్!
X

‘రాజకీయాలంటే మరో వృత్తి కాదు.. పవిత్ర ప్రజాసేవ’ అంటూ ప్రముఖ తమిళనటుడు, కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ జోసెఫ్ (విజయ్ దళపతి) ఇటీవల తన రాజకీయ అరంగేట్రం సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పేరుతో పార్టీని ప్రారంభించడం ద్వారా తాను పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టిన నటులెవరు అనే చర్చ నడుస్తున్నది. దక్షిణాది రాజీకీయ చరిత్రను పరిశీలించినా సినీ రంగానికి, రాజకీయ రంగానికి అవినాభావ సంబంధం ఉందనిపిస్తుందని విశ్లేషకులు అంటుంటారు. చిత్ర పరిశ్రమలో తమకున్న ఫేమ్ ఉపయోగించుకొని పొలిటికల్‌గా ఎదగాలని ఎందరో ప్రయత్నించారు. ఈ ట్రెండ్ ఇప్పటికీ అది కొనసాగుతోంది. తెలుగు నాట ఎన్టీఆర్ మొదలు కొని పవన్ కళ్యాణ్ వరకు, తమిళనాట ఎంజీఆర్ మొదలుకొని విజయ్ దళపతి వరకు అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో ఆసక్తి చూపినవారే. అయితే ఎవరెవరు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు, ఏ పార్టీని స్థాపించారో ఇప్పుడు చూద్దాం.

ఎండీ జావిద్ పాషా

ఎంజీఆర్ (అన్నాడీఎంకే, 1972)

ఎంజీఆర్‌గా అందరికీ సుపరిచితుడైన మారుతుర్ గోపాలన్ రామచంద్రన్ 1936లో తమిళ్ ఇండిస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక్కడ అగ్రశ్రేణి నటుగా ఫుల్ ఫేమ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. మొదట కాంగ్రెస్ పార్టీతో పొలిటికల్ కెరీర్‌ను ప్రారంభించిన ఎంజీఆర్ 1953లో ‘ద్రవిడ మున్నేట్ర కజగం’లో చేరారు. 1969లో ఈ పార్టీ వ్యవస్థాపకులు సీఎన్ అన్నాదురై మరణించిన తర్వాత బయటకు వచ్చేసిన ఎంజేఆర్ 1972 అక్టోబర్ 17న అన్నాడీఎంకేను స్థాపించారు. 1977 జూన్ నుంచి 1987 (డిసెంబర్)లో తాను మరణించే వరకు మూడు దఫాలుగా తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. చిత్రపరిశ్రమలో ఉన్నప్పుడు ఎంజీ రామచంద్రన్‌‌‌కు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అభిమానులు ముద్దుగా ఎంజీఆర్ఆర్ అని పిలిచేవారు. సినిమాల్లో ఆయన రాబిన్ హుడ్ లాంటి రోల్స్ ఎక్కువగా చేశారు. సినిమాల్లో ఉన్నప్పుడే ఆయన నటించిన సినిమాల్లోని పలు సన్నివేశాల్లో ప్రజలకు సేవచేయడం, వారి బాగోగులు చూడటానికి రాజకీయాల్లోకి వస్తాను అన్నట్లుగా చూపించేవారు. దాదాపు150కి పైగా సినిమాల్లో చేసిన ఎంజీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించి సీఎం అయ్యాక వాటికి గుడ్ బై చెప్పారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. ఎంజీఆర్‌కు పెద్ద సక్సెస్ అందించిన సినిమా ‘మళైక్కల్లన్’ ఈ సినిమాకు రచయిత ఎంజీఆర్ కన్నా ముందు తమిళనాడు సీఎంగా పనిచేసిన ఎం. కరుణానిధి. నటుడిగానే కాకుండా కరుణానిధి రైటర్‌గా సినీ ఇండిస్ట్రీలో పలు సినిమాలకు పనిచేశారు. కరుణానిధి, ఎంజీఆర్ కలిసే ఉండేవారు. కానీ ఆ తర్వాత కొన్ని విభేదాల కారణంగా విడిపోయారు. ఎంజీఆర్ వేరేపార్టీ పెట్టి తర్వాతి కాలంలో సీఎం అయ్యారు.

ఎన్టీరామారావు ( టీడీపీ,1982)

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన అగ్రశ్రేణి నటుడు నందమూరి తారకరామారావు. పౌరాణిక, జానపద, సాంఘీక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. రాముడు, కృష్ణుడు వంటి పాత్రల్లో నటించి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేశారు. 1982లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అదే ఏడాది మార్చి 29న తెలుగు దేశం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత తొమ్మిది నెలల్లోనే అంటే.. 1983 జనవరిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున 294 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి, 199 సీట్లు గెలిచి ఘన విజయం సాధించారు. సినీ రంగం నుంచి వచ్చిన కొంతకాలానికే రాజకీయ రంగంలో రాణించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. పరిపాలనా పరంగా వినూత్న సంస్కరణలు తీసుకొచ్చిన నేతగా గుర్తింపు సంపాదించారు. మూడుసార్లుగా సీఎంగా అధికారం చేపట్టారు. అప్పట్లో రాజకీయంలో ప్రవేశించిన ఎన్టీఆర్ ‘చైతన్య రథం’ అని ఒక మినీ బస్సును తయారు చేయించి అందులో గ్రామ మ్రామాన పర్యటిస్తూ ప్రచారం నిర్వహించారు. అలా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలే అయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పాయి. కాగా చైతన్య రథం నడపడానికి అప్పట్లో ఎన్టీఆర్ తన కుమారుడు హరికృష్ణనే ఎంచుకోవడం విశేషం. తెలుగు ప్రజలందరూ అన్నగా పిలుచుకునే నందమూరి తారకరామారావు సినిమాల్లో ఎంతగా ఆకట్టుకున్నారో, రాజకీయాల్లోనూ అంతగా ఆకట్టుకున్నారు.

శివాజీ గణేశన్ (టీఎంఎం, 1988)

తమిళ నటుడు శివాజీ గణేషన్ 1988లో ‘తమిళ మున్నేట్ర మున్నని’ (టీఎమ్ఎమ్) పార్టీని స్థాపించారు. కా 1989 ఎన్నికల్లో బరిలో నిలిచిన ఈ పార్టీ దారుణంగా ఓటమిపాలయింది. తిరువాయిర్ స్థానం నుంచి పోటీచేసిన శివాజీ గణేషన్ కూడా ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తమ కార్యకర్తలను జనతాదళ్‌లో చేరాలని సూచించారు.

కెప్టెన్ విజయ్ కాంత్ (డీఎండీకే 2005)

తమిళ రాజకీయ నాయకుడు, కెప్టెన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కాంత్ కూడా ఒకప్పుడు సినీనటుడు. అసలు పేరు విజయ్ రాజ్ అళగర్ స్వామి. 1979లో ‘ఇనిక్కుం ఇలామై’ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలో ప్రవేశించి మంచి గుర్తింపపు తెచ్చుకున్నారు. నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో వందలాది సినిమాలు చేసి అభిమానులను అలరించారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి 2005లో దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం(డీఎండీకే)ను స్థాపించారు. 2006 ఎన్నికల్లో రాష్ట్రంలోని 234 స్థానాల్లోనూ డీఎండీకే అభ్యర్థులను నిలబెట్టారు. కానీ కేవలం ఆయన ఒక్కరే గెలుపొందారు. ఇక 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేశారు. అప్పట్లో 29 సీట్లలో గెలిచారు. కాగా 2014 ఎన్నికల్లో 104 స్థానాల్లో డీఎండీకే పోటీ చేసినా ఒక్క స్థానంలోనూ గెలవలేదు.

శరత్ కుమార్ (ఏఐఎస్ఎంకే 2007)

సినిమాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న తమిళ నటుడు శరత్ కుమార్ 1994 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అయితే 2007లో సొంతంగా ‘ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి (ఏఐఎస్ఎంకే) పేరుతో పొలిటికల్ పార్టీని స్థాపించారు. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి ఈ పార్టీ పోటీ చేసినప్పటికీ రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది.

కమల్ హాసన్, (ఎంఎన్ఎం, 2018)

ప్రముఖ నటుడు కమల్ హాసన్ గురించి తెలిసిందే. అసలు పేరు పార్థసారథి శ్రీనివాస్. 1960లో ఆరేండ్ల వయస్సులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి ‘ఉలగనాయగన్’ అని కూడా పిలువబడే కమల్ హాసన్ ఆరు దశాబ్దాల సినీ కెరీర్‌లో వివిధ భాషల్లో కలిపి 230కి పైగా చిత్రాల్లో నటించారు. కాగా 2018లో ‘మక్కల్ నీది మయ్యమ్’ (ఎంఎన్ఎం) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. కోయంబత్తూర్ నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తు్న్నట్లు వార్తలు వినిపించాయి. తమిళనాడుతోపాటు పుదుచ్చేరిలో కూడా ఎంఎన్ఎం క్రియాశీలంగా ఉంది.

కార్తీక్ (ఏఐఎన్ఎం,2009)

తమిళ సీనియర్ నటుడు కార్తీక్ 2009లో ‘అఖిల ఇండియా నాదలం మక్కల్ కట్చి’ ( ఏఐఎన్ఎమ్ కే) పార్టీని స్థాపించారు. ఇందులో ఆయన అభిమానులే ఎక్కువ. 2006లో సినీ రంగం నుంచి రాజకీయాల్లో ప్రవేశించారు. మొదట ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరిన ఆయన అప్పట్లో తమిళనాడు రాష్ట్ర విభాగానికి కార్యదర్శిగా కూడా చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చి 2009 లోక్ సభ ఎన్నికలకు ముందు సొంత పార్టీని పెట్టారు. 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు కోసం ప్రయత్నించి విఫలం అయ్యారు.

విజయ్ దళపతి (టీవీకే, 2024)

ప్రముఖ తమిళనటుడు, కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ జోసెఫ్ (విజయ్ దళపతి) 2024లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ‘తమిళ వెట్రి కజగం (టీవీకే) పేరుతో పార్టీని ప్రారంభించినట్లు ఫిబ్రవరి 2న ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రణాళిక ఈ ఏడాది జనవరి 25న చెన్నైలో ఖరారైంది. అప్పట్లోనే పార్టీ జనరల్ కమిటీ, కార్య నిర్వాహక కమిటీ, పార్టీ అధ్యక్షుడు, కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం గుర్తింపుకోసం దరఖాస్తు చేసుకున్నారు. అది కూడా లభించడంతో ఫిబ్రవరి 2న అధికారికంగా పార్టీ ప్రకటించారు. కాకపోతే టీవీకే 2024 ఎన్నికల్లో తమ పోటీ చేయదని, ఏ పార్టీకీ సపోర్ట్ కూడా చేయమని విజయ్ స్పష్టం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తప్పక పోటీ చేస్తామని తెలిపారు.

ఉపేంద్ర (యూపీసీ, 2018)

సినిమాల్లో తనకంటూ ప్రత్యేక ఫేమ్ సంపాదించుకున్న ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర 2018లో ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ’ని స్థాపించారు. ఆ తర్వా 2019 సాధారణ ఎన్నికల్లో ఈ పార్టీ కర్ణాటక వ్యాప్తంగా పోటీ చేసినప్పటికీ ఒక్క స్థానంలోనూ ఖాతా తెరవలేకపోయింది. పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా ఉపేంద్ర బయటకు వచ్చారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

చిరంజీవి (పీఆర్‌పీ, 2008)

ప్రముఖ తెలుగు నటుడు కొణిదెల చిరంజీవి గురించి తెలిసిందే. చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన 2008 ఆగష్టు 26న ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించారు. తిరుపతిలో భారీ సభ పెట్టి పార్టీని ప్రకటించారు. ఉమ్మడి ఏపీలో 294 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేయగా.. కేవలం 18 సీట్లు గెలిచింది. చిరంజీవి రెండుచోట్ల పోటీ చేయగా ఒకచోట గెలిచారు. 2011లో ఈ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం అయింది. 2009 -12 మధ్య మెగాస్టార్ తిరుపతి ఎమ్మెల్యేగా సేవలందించారు. ఆ తర్వాత 2012లో రాజ్య సభకు ఎన్నికైన చిరంజీవి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కల్చర్, టూరిజం శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2018లో ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగిసినప్పటి నుంచి ఇక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

పవన్ కళ్యాణ్ (జనసేన, 2014)

చిత్రపరిశ్రమలో ఫుల్‌ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు పవన్ కళ్యాణ్. తన సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేశారు. 2014 మార్చిలో సొంతంగా జనసేన పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఏపీలో ఈ పార్టీ యాక్టివ్‌గా ఉంది. సాధారణంగా సినీ నటులు రిటైర్మెంట్ ఏజ్‌లోనో, సినిమాల్లో ఆదరణ తగ్గినప్పుడో రాజకీయాల్లోకి వస్తుంటారు. పవన్ కళ్యాణ్ మాత్రం కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కాగా 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జనసేన టీడీపీకి మద్దతు ప్రకటించింది. 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. మరోసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్‌తోపాటు 21 స్థానాల్లో జనసేన అభ్యర్థులను గెలిపించుకోవడంలో పవన్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కూటమి (టీడీపీ, బీజేపీ, జనసేన) ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

విజయశాంతి (తల్లి తెలంగాణ, 2009)

సినీ నటిగా అలరించి, లేడీ సూపర్ స్టార్‌గా పేరుతెచ్చుకున్న విజయశాంతి సుపరిచితమే. ఆమె 1998లో బీజేపీలో చేరారు. 2009లో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా ‘తల్లి తెలంగాణ’ పార్టీని స్థాపించారు. కాగా కొద్దికాలానికే ఈ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు బీఆర్ఎస్)లో విలీనం చేశారు. ఆ తర్వాత ఈ పార్టీని కూడా వీడి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు.

బాలీవుడ్ నటుడు దేవానంద్ (ఎన్పీఐ1979)

ప్రముఖ బాలీవుడ్ నటుడు దేవానంద్ 1979 సెప్టెంబర్‌లో ‘నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా’ను స్థాపించారు. కాగా చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయ రంగంలోకి ఆయన ప్రవేశానికి ప్రత్యేక కారణం ఎమెర్జెన్సీ. 1975లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ వైఖరికి వ్యతిరేకంగా నిలిచిన వారిలో సినీ ప్రముఖులు చాలామందే ఉన్నారు. అప్పట్లో కాంగ్రెస్‌ను గద్దె దించడానికి బాలీవుడ్ సినీ నటులంతా ఏకమై ఒక రాజకీయపార్టీ పెట్టాలనుకున్నారు. అధ్యక్షునిగా దేవానంద్‌ను నియమించాలని నిర్ణయించుకున్నారు. ఇక అంతలోనే 1979లో జనతా ప్రభుత్వం కూలిపోయి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు బాలీవుడ్ నటులంతా కలిసి అదే ఏడాది సెప్టెంబర్ 4న ముంబైలోని తాజ్ మహల్ హోటల్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే ‘నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా’ను దేవానంద్ ప్రకటించారు.

రాఖీ సావంత్ (రాప్, 2014)

​బాలీవుడ్ బోల్డ్ నటిగా ఫేమస్ అయిన రాఖీ సావంత్ 2014లో రాష్ట్రీయ ఆమ్ ఆద్మీ పార్టీ(రాప్)ని స్థాపించారు. అదే ఏడాది లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని వాయువ్య ముంబై నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. పార్టీ సింబల్ మిరపకాయ గుర్తు. కాగా ఆమె ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. కేవలం 15 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత సొంత పార్టీకి రాజీనామా చేసి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలె)లో చేరారు. అప్పట్లో ఆమె బీజేపీలో చేరి మోడీతో కలిసి పనిచేయాలని ఉందని కూడా ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు.

రాజ్‌పాల్ నౌరంగ్ యాదవ్ (ఎస్‌ఎస్‌పీ 2018)

బాలీవుడ్ హాస్యనటుడు రాజ్‌పాల్ నౌరంగ్ యాదవ్ సినిమాల్లో ఎంతగా అలరించారో తెలిసిందే. కాగా ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశంతో 2018లో సర్వ సంభవ్ పార్టీని పెట్టారు. తాను నీతివంతమైన, స్వచ్ఛమైన రాజకీయాల కోసమే పార్టీ పెట్టినట్లు ప్రకటించారు. యూపీలోని 409 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని కూడా అప్పట్లో తెలిపారు. ఆ తర్వాత ఏమైందో కానీ పార్టీ ఫంక్షనింగ్‌లో లేకుండా పోయింది. దీనిపై రాజ్‌పాల్ కూడా ఎన్నడూ స్పందించిన దాఖలాలు లేవు.

తెలుగు తేజాలు నలుగరు..

*చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి సొంతంగా రాజకీయ పార్టీలు స్థాపించిన సినీ ప్రముఖులు ఎంతోమంది ఉండగా.. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నలుగురు మాత్రమే ఉన్నారు. వీరిలో నందమూరి తారక రామారావు మొట్టటి వారు కాగా ఆయన 1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీని స్థాపించారు. 1983 ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ఆయన తర్వాత కాలంలో టాలీవుడ్ నుంచి రాజకీయారంగేట్రం చేసిన రెండవ వ్యక్తి కొణిదెల చిరంజీవి 2008 ఆగష్టు 26న ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించారు. ఇక మూడవ వ్యక్తి ప్రముఖ నటి విజయ శాంతి. 1998 నుంచి రాజకీయాల్లో ఉన్న ఈమె 2009లో ‘తల్లి తెలంగాణ’ పార్టీని స్థాపించారు. కొద్దికాలానికే దానిని తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు బీఆర్ఎస్)లో విలీనం చేశారు. ఇక రంగుల ప్రపంచం నుంచి రాజకీయ రంగంలో అడుగు పెట్టిన తెలుగు నటుల్లో 4వ వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్. 2014 మార్చిలో సొంతంగా జనసేన పార్టీని స్థాపించారు.

తమిళనాడు నుంచే ఎక్కువ :

రంగుల తెర నుంచి రాజకీయ రంగంలోకి వచ్చి పార్టీ పెట్టిన వారి సఖ్య చూస్తే తమిళ్ ఇండస్ట్రీ వారే ఎక్కువగా కనిపిస్తారు. అన్నా దురై, ఎంజీఆర్ మొదలు కొని విజయ్ దళపతి వరకు చాలా మందే ఉన్నారు. మిగతా బాషల చిత్ర పరిశ్రమల నుంచి వచ్చి పొలిటికల్ పార్టీలు పెట్టిన వారు కూడా ఉన్నప్పటికీ చాలా తక్కువ. అయితే ఎందుకని తమిళ నటులు రాజకీయాలవైపు మొగ్గు చూపుతారు? అనే సందేహాలు కలగడం సహజమే. విశ్లేషకుల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తే తమిళనాడులో రాజకీయ చైతన్యం ఎక్కువ. ద్రవిడ సంస్కృతి మూలాలే ఇందుకు కారణంగా చెప్తారు. వందేళ్ల క్రితమే తమిళనాట ఆధిపత్యాన్ని, మూఢ నమ్మకాలను, కుల, మత వివక్షలను ప్రశ్నించే ఉద్యమాలు ప్రారంభం అయ్యాయి. ఆత్మ గౌరవంతో కూడిన కుల రహిత నాస్తిక, హేతు వాద సమాజమే లక్ష్యంగా పెరియార్ రామస్వామి లాంటి వారు సామాజిక ఉద్యమాలను నడిపించారు. ఆ తర్వాత ద్రవిడ కళగం పేరుతో పెరియార్ రాజకీయ పార్టీని స్థాపించారు. కాల క్రమంలో స్థానికత, నాస్తివాద భావజాలం తమిళ ప్రజల్లో పెరిగిపోవడం ఇక్కడి రాజకీయ చైతన్యానికి నిదర్శనంగా నిలిచింది. అయితే కాల క్రమంలో మార్పులు వచ్చాయి. రాజకీయాల్లో కుల సమీకరణలు, మతరాజకీయాలు కొంత తమిళనాడులో ప్రవేశించినా.. మెజార్టీ ప్రజల్లో మాత్రం ఇప్పటికీ నాస్తికవాద ద్రవిడ సంస్కృతి వారసత్వ చైతన్యమే కొనసాగుతోంది. సహజంగానే ఇది సినీ రంగంలోనూ ఉంటుంది. కాబట్టి సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చేవారిలో తమిళ నటులు ఎక్కువగా ఉండటంలో పెద్దగా ఆశ్పర్యం లేదంటున్నారు నిపుణులు.

ముఖ్యమంత్రులుగా ఇద్దరు

రాజకీయాల్లో ప్రవేశించి సొంతంగా పార్టీలు పెట్టిన నేతల్లో ఇద్దరు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి సంచలనం సృష్టించారు. వీరీలో 1972లో రాజకీయారంగేట్రం చేసిన తమిళ నటుడు ఎంజీఆర్ ఒకరు కాగా, 1982లో రాజకీయపార్టీ స్థాపించిన ప్రముఖ తెలుగు నటులు నందమూరి తారకరామారావు మరొకరు. ఇక ఎంజీఆర్‌ విషయానికి వస్తే మొదట కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 1953లో ‘ద్రవిడ మున్నేట్ర కజగం’లో చేరారు. 1969లో ఈ పార్టీ వ్యవస్థాపకులు సీఎన్ అన్నాదురై మరణించిన తర్వాత బయటకు వచ్చారు. 1972 అక్టోబర్ 17న అన్నాడీఎంకేను స్థాపించారు. 1977 జూన్ నుంచి 1987 (డిసెంబర్)లో తాను మరణించే వరకు మూడు దఫాలుగా తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. తెలుగు తెర నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ తొమ్మిది నెలల కాలంలోనే.. అంటే 1983లో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

Advertisement

Next Story

Most Viewed